AP:డ్రగ్స్ మూలాలపై ప్రత్యేక దృష్టి..గంజాయి నివారణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్

by Mamatha |
AP:డ్రగ్స్ మూలాలపై ప్రత్యేక దృష్టి..గంజాయి నివారణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:డ్రగ్స్ మూలాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీసీపీ మోకా సత్తిబాబు అన్నారు. ఈ మేరకు ఆర్ అండ్ బి జంక్షన్ వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు గంజాయి నివారణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించామన్నారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు యాక్షన్ టీం పని చేస్తుందన్నారు. ఇప్పటికే గంజాయి వినియోగిస్తున్న కొన్ని ప్రాంతాలను గుర్తించమని ఆయా ప్రాంతాల్లో నిత్యం పోలీసు సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

అదేవిధంగా డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు పలు పాఠశాలలతో పాటు కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. అందుకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ, ప్రజా ప్రతినిధులు, ఆయా పాఠశాల, కళాశాలల ఉపాధ్యాయులను సమన్వయ పరుస్తూ ముందుకు వెళ్తామన్నారు. అందులో భాగంగా పోలీసులను, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తూ యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటుచేసి డ్రగ్స్ సరఫరా పై గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గంజాయి ప్రధాన సమస్యగా మారిందని వాటి వినియోగం వల్ల సమస్యాత్మకమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని గుర్తు చేశారు. గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసే విధంగా పెందుర్తి సరిపల్లి వద్ద చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి అదనపు సిబ్బందితో నిరంతరం ప్రతి వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు.

జోన్ -2 పరిధిలో ఇప్పటికే 185 ఎన్ డి పి ఎస్ కేసులు నమోదయ్యాయని అలాగే 339 గంజాయి కేసులు ట్రైల్ లో ఉన్నాయన్నారు. ఆయా కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు గంజాయి నివారణకు సహకరిస్తూ గంజాయి రవాణాపై సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటుగా వారికి రివార్డులు అందజేస్తామని అన్నారు. అంతకుముందు వెస్ట్ సబ్ డివిజన్ కు సంబంధించి సీఐ లతో గంజాయి నివారణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తను వివరిస్తూ సమీక్షించారు. సమావేశంలో వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ అన్నెపు నరసింహ మూర్తి , హార్బర్ ఏసీపీ బి మోసెస్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

Read More..

BREAKING: హర్యానాలో హస్తం పార్టీకి బిగ్ షాక్..ఎమ్మెల్యే కిరణ్ చౌదరి రాజీనామా రేపు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు

Next Story