Dasara Navratri: బాసరలో శైలపుత్రి.. బెజవాడలో బాలాత్రిపుర సుందరి

by Y.Nagarani |
Dasara Navratri: బాసరలో శైలపుత్రి.. బెజవాడలో బాలాత్రిపుర సుందరి
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అక్టోబర్ 12 వరకూ దసరా సంబురాలు అంబరాన్నంటేలా జరుపుకోనున్నారు ప్రజలు. దేశంలో ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. బెజవాడలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా.. తొలిరోజు కనకదుర్గమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి (Vijayawada Durga Temple) అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం అమ్మవారికి అర్చకులు స్నాపనాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. ఇంద్రకీలాద్రి కొండ కింద ఉన్న వినాయకుడి ఆలయం వరకూ క్యూ లైన్ ఉంది.

విజయవాడలో నవరాత్రి ఉత్సవాల్లో మొత్తం 6 వేల మంది పోలీసులు బందోబస్త్ గా ఉన్నారు. దుర్గగుడి చరిత్ర తెలిసేలా కొండపై లేజర్ షో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దుర్గాఘాట్ వద్ద నిర్వహించే హారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 10 రోజులపాటు జరిగే దసరా ఉత్సవాలకు సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ పాలకమండలి అంచనా వేసింది. ఈ మేరకు భక్తులకు అన్నపానీయాలు అందించడంలో ఎలాంటి కొరత లేకుండా ఏర్పాట్లు చేసింది.

తెలంగాణలోని బాసర సరస్వతి దేవి ఆలయంలో (Basara Temple) శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యారు. గురువారం తెల్లవారుజామున జ్ఞాన సరస్వతీదేవి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు మహాభిషేకం, అలంకరణ, మంగళహారతి, మంత్రపుష్పం పూజలు నిర్వహించి.. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య వైద్యసేవ, గణపతిపూజ, సుప్రభాత సేవలు నిర్వహించారు. నేడు జ్ఞాన సరస్వతీ దేవి శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజున అమ్మవారికి కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించారు.

ఆలయానికి భక్తుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో.. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదేశాలు జారీ చేశారు. త్రాగునీరు, వసతి, భోజనం ఏర్పాట్లను పరిశీలించారు.

Next Story

Most Viewed