Shyamala Rao : రేపటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఈవో శ్యామల రావు కీలక ప్రకటన

by Shiva |
Shyamala Rao : రేపటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఈవో శ్యామల రావు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavalu) ప్రారంభం కానున్నాయి. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానుండటంతో విస్తృత ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్యామల రావు (EO Shyamala Rao) గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి తిరుమల (Tirumala) బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇంజినీరింగ్‌ పనులు, లడ్డూల బఫర్‌ స్టాక్‌, ఉద్యాన శాఖ, ట్రాన్స్‌ పోర్ట్‌, కల్యాణ కట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, అన్న ప్రసాదం, దర్శనం, వసతి, కళా బృందాల కార్యక్రమాలు, విజిలెన్స్‌ విభాగం భద్రతా ఏర్పాట్లపై చర్చించామని వెల్లడించారు.

శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు అరంభం అవుతాయని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలను నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబరు 8న గరుడ సేవ ఉంటుందని తెలిపారు. ఇక అక్టోబర్ 9న స్వర్ణ రథం, 11న రథోత్సవం, 12న చక్రస్నాన కార్యక్రమాలు కొనసాగతాయని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి స్వామి వారి రథోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. స్వామి వారిని దర్శించకునేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అదనంగా 7 లక్షల లడ్డూ ప్రసాదాల స్టాక్‌ను సిద్ధం చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తిరుమల చేరుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ (APS RTC) వారితో మాట్లాడి 400 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని అన్నారు. గురుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్లను తెరుస్తామని వెల్లడించారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దంపతులు శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో శ్యామల రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed