- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీలో విజయసాయి రెడ్డి నెంబర్ 2 స్థానం గల్లంతు!
సీఎం జగన్ తర్వాత వైసీపీలో, ప్రభుత్వంలో ఎవరంటే ఠక్కున విజయసాయి రెడ్డి పేరు వినిపించేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ట్విట్టర్ లో ప్రతిపక్షాలపై తరచూ విరుచుకుపడే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎటు పోయారని పార్టీ యంత్రాంగంలో వినిపిస్తోంది. తారకరత్న మృతి ఘటనతో ఆయన మరింత సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది. విజయసాయి రెడ్డి సొంత మీడియా సంస్థలను నెలకొల్పుతున్నారనే ప్రచారంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో అర్థంగాక కేడర్‌లో అయోమయం నెలకొంది.
దిశ, ఏపీ బ్యూరో: తొలుత వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డితో విజయసాయికి మంచి సంబంధాలుండేవి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితోనూ అదే స్థాయిలో సంబంధాలు కొనసాగించారు. గత ఎన్నికలకు ముందు పార్టీ నిర్మాణ బాధ్యతలను భుజస్కంధాలపై మోశారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక విజయసాయి రెడ్డి సూచనలు, సలహాలు కచ్చితంగా ఉండేవి. ఎన్నికల్లో అన్నీ తానై నడిపించారు. అద్భుత విజయాన్ని జగన్ కు కానుకగా అందించారు. ఎన్నికల తర్వాత కూడా జగన్ తర్వాత స్థానం విజయసాయి రెడ్డిదేనని పార్టీలో పేరొచ్చింది.
ఉత్తరాంధ్రలో ఎన్నో ఆరోపణలు..
ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల్లో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అక్కడ భూముల ఆక్రమణలు, అవినీతి, అక్రమాలపై విజయసాయి రెడ్డి కుటుంబం అనేక ఆరోపణలు ఎదుర్కొంది. స్థానిక ఎంపీ తో పాటు పలువురు నేతలతో విభేదాలు మొదలయ్యాయి. ఆ పాటికే విజయసాయి రెడ్డి కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. కేంద్రంలో లాబీయింగ్ చేస్తూ పార్టీకి ఆయన సేవలు అందించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆరోపణల నేపథ్యంలో విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.
ఆ పదవైనా ఉంచుతారా?
అనంతరం విజయసాయి రెడ్డికి పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించారు. ఆ పాటికే సోషల్ మీడియా బాధ్యతలు కూడా ఆయనే చక్కబెట్టేవారు. ఇటీవల పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు. సోషల్ మీడియా బాధ్యతలను సజ్జల కుమారుడికి ఇచ్చారు. ఇలా ఒక్కొక్క పదవి తొలగిస్తూ పార్టీలో విజయసాయి పాత్రను బాగా కుదిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేవలం పార్లమెంటరీ పార్టీ నేతగా మాత్రమే మిగిలారు. కనీసం దీన్నయినా ఉంచుతారా ? లేదా ? అనేది సందేహంగా మారింది.
ట్విట్టర్లోనూ సైలెంటే...
తారకరత్న బంధువు కావడంతో విజయసాయిరెడ్డి... చంద్రబాబు, బాలకృష్ణతో సన్నిహితంగా మెలగాల్సి వచ్చింది. దీన్ని సీఎం జగన్ ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియదు. ఇది వైసీపీ శ్రేణులకు ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. అక్కడ కూడా విజయసాయిరెడ్డి తనదైన తరహాలో టీడీపీ నేతలపై విరుచుకుపడతారని ఆశించారు. దీనికి భిన్నంగా విజయసాయిరెడ్డి చాలా సౌమ్యంగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఆయన విపక్షాలపై దూకుడును తగ్గించినట్టు కనిపిస్తున్నది. ట్విట్టర్ లో విమర్శలేమీ కనిపించడం లేదు.
మీడియా రంగంలోకి విజయసాయి?
మరోవైపు విజయసాయి రెడ్డి సొంత పత్రికను, టీవీ చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ శ్రేణులు మరింత గుర్రుగా ఉన్నాయి. సాక్షి మీడియా ఉండగా మళ్లీ విజయసాయి రెడ్డి సొంత మీడియాను తీసుకు రావడం వెనుక మతలబు ఏంటని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీ వాయిస్ ను వినిపించడం కోసమే విజయసాయి మీడియా రంగంలోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. దీనిపై విజయసాయి గానీ, పార్టీ నేతలు గానీ ఎవరు స్పందించడం లేదు. అంతర్గతంగా పార్టీలో చర్చ జరుగుతోంది.
అదే జరిగితే...
సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2 గా విజయసాయిరెడ్డి పేరుంది. సీబీఐ, ఈడీ కేసులో జగన్ తర్వాత రెండో ముద్దాయిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గించడం వెనుక బీజేపీకి దగ్గరవుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల కేసుల నుంచి బయటపడేందుకు విజయసాయి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం పార్టీలో నెలకొంది. ఇలాంటి తరుణంలో విజయసాయిరెడ్డి పూర్తిగా పార్టీకి దూరమైతే పరిస్థితులు ఎలా మారతాయనే దానిపై పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. సీఎం జగన్ కు సంబంధించిన ‘ఎన్నో విషయాలు’ విజయసాయి రెడ్డికి పూర్తిగా తెలిసి ఉండడమే ఇందుకు కారణం కావచ్చు.