ఉండవల్లి ఎఫెక్ట్..చంద్రబాబు మెడకు సీబీఐ కత్తి : తేల్చేసిన జగన్ సర్కార్

by Seetharam |
ఉండవల్లి ఎఫెక్ట్..చంద్రబాబు మెడకు సీబీఐ కత్తి : తేల్చేసిన జగన్ సర్కార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్‌మెంట్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో 52 రోజులపాటు రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు అనారోగ్య సమస్యలతో ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కిల్ స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఒకవైపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బాంబు పేల్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సీబీఐకు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో స్కిల్ స్కాం కేసును సీబీఐ విచారణకు ఇవ్వటానికి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలియజేశారు.అదే సమయంలో గత విచారణ సమయంలో కోర్టు ఆదేశించిన విధంగా నోటీసులు అందరికీ అందలేదని న్యాయవాదులు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.

ఈనెల 29కు వాయిదా

స్కిల్ స్కాం కేసు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినది అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. స్కిల్‌ స్కాం కేసు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనే ముడిపడలేదని ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉందని ఉండవల్లి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విచారణ సీఐడీ నుంచి..సీబీఐ విచారణకు ఇవ్వాలని కోరారు. లోతైన విచారణ అవసరమని కోర్టుకు తెలియజేశారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ, ఏపీ ప్రభుత్వంతోపాటు స్కిల్‌ స్కాం నిందితులందరినీ ఉండవల్లి తన పిటీషనల్ లో ప్రతివాదులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఇప్పటికే 44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించింది. అయితే ఈ కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఈ నోటీసులు అందరికీ అందలేదని న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆలస్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

కోర్టు తీర్పుపై ఉత్కంఠ

ఇకపోతే ఉండవల్లి వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ నిమిత్తం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలియజేశారు. అంతేకాదు స్కిల్ స్కాం కేసుకు సంబంధించి సమాచారాన్ని సీబీఐకు కూడా ప్రభుత్వం అందించిందని తెలిపారు. స్కిల్‌ స్కాం కేసు సీబీఐ విచారణకు ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతర లేదని ఏజీ న్యాయస్థానానికి తెలియజేశారు. సీబీఐ విచారణకు ఇవ్వాలని ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే కోరిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకు ఇవ్వడంపట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story