TTD: తిరుమల భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి.. దయచేసి వాళ్లు రావొద్దు

by Rani Yarlagadda |   ( Updated:2024-10-25 09:31:57.0  )
TTD: తిరుమల భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి.. దయచేసి వాళ్లు రావొద్దు
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాదిమంది తిరుమలకు వెళ్తుంటారు. తలనీలాల మొక్కులు, కాలినడక మొక్కుల్ని తీర్చుకుని స్వామి వారి దర్శనంతో ఆ అలసటనంతా మరిచి.. దేవుడిని చూశామన్న ఆనందంతో తిరుగుపయనమవుతారు. కాగా.. తిరుమలకు కాలి నడకన వచ్చే భక్తులకు టీటీడీ (TTD) కీలక విజ్ఞప్తి చేసింది.

ఇటీవల కాలంలో తిరుమల(Tirumala)కు కాలినడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదైనట్లు టీటీడీ పేర్కొంది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు.. షుగర్, బీపీ, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు కాలినడకన తిరుమలకు రావొద్దని సూచించింది. అది వారి ఆరోగ్యానికే మంచిది కాదని తెలిపింది. ఆయా సమస్యలున్న భక్తులు బస్సుల ద్వారా కొండపైకి చేరుకుని, దర్శనం చేసుకోవాలని కోరింది. దయచేసి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

తిరుమల కొండ సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని, అందుకే కాలినడకన రావడం ఒత్తిడితో కూడుకున్న విషయమని తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు రోజువారి మందుల్ని వెంట తెచ్చుకోవాలని సూచించింది. కాలినడకన వచ్చేవారికి ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే..1500 మెట్టు వద్ద, గాలిగోపురం, భాష్య కార్ల సన్నిథి వద్ద ట్రీట్మెంట్ తీసుకోవచ్చని సూచించింది. అలాగే అశ్వినీ, ఇతర ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది.

Advertisement

Next Story