మనుషుల్లా వ్యవహరించి చంద్రబాబుకు వైద్యం అందించండి : Nara Rohit

by Seetharam |   ( Updated:2023-10-15 11:01:18.0  )
మనుషుల్లా వ్యవహరించి చంద్రబాబుకు వైద్యం అందించండి : Nara Rohit
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత, పెదనాన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హీరో నారా రోహిత్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేక భౌతికంగా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. చంద్రబాబు పట్ల వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించిన చంద్రబాబు పట్ల జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అమానుషం అన్నారు. తన రాజకీయ జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన చంద్రబాబును అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. చంద్రబాబు జైలులో డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని... తక్షణ వైద్యం అందించాలని వైద్యులు చెప్తున్నా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని చూస్తే వారి రాక్షస పోకడలు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నాయి అని అన్నారు. వైద్యులు ఇచ్చిన రిపోర్టును బయటపెట్టకపోవడంలో ఉన్న ఆంతర్యమూ ప్రజలకు అర్థమైందని అన్నారు. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు పట్ల ప్రభుత్వ పెద్దలు చేస్తున్న అవహేళలు వ్యాఖ్యలను విని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. 74 ఏళ్ల వయసున్న ఆయనకు కనీస వసతులు కల్పించడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రాకపోవడాన్ని ఏమనాలని నిలదీశారు. న్యాయస్థానాలు ఆదేశాలిచ్చేంత వరకు వసతుల ఏర్పాటుకు వేడుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజల సంపద... ఆయన్ను ప్రజలే రక్షించుకుంటారని చెప్పుకొచ్చారు. మహోన్నత స్థాయి కలిగిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తే సమాజం క్షమించదన్న విషయం గుర్తుంచుకోవాలి అని సూచించారు. ఇప్పటికైనా కక్షలు, కార్పణ్యాలు వీడి మనుషుల్లా వ్యవహరించి చంద్రబాబుకు అవసరమైన వైద్యం అందించాలని ఓ ప్రకటనలో హీరో నారా రోహిత్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed