తిరుపతి: ప్రేమ జంట ఆత్మహత్య కలకలం

by Seetharam |
తిరుపతి: ప్రేమ జంట ఆత్మహత్య కలకలం
X

దిశ , డైనమిక్ బ్యూరో : పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదనో లేక మరే ఇతర కారణాలతోనో తెలియదు కానీ ఓ ప్రేమ జంట రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు పట్టాలపై ఇద్దరు మృతదేహాలను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషాదఘటన తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్‌ పరిధిలో జరిగింది. గూడూరు-కొండాగుంట రైల్వేస్టేషన్‌ల మధ్య తిరుపతి మార్గంలో దిగువ రైలు పట్టాలపై యువతీ, యువకులు చనిపోయి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. రైలు పట్టాలు, మృతుల వద్ద లభించిన ఆధారాల ప్రకారం యుకుడిది పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడుకు చెందిన దండే రాకేష్‌(23), పల్నాడు జిల్లా మాచవరం మండలం రుక్మిణిపురానికి చెందిన అన్నంగి పావని(19)గా గుర్తించారు. గూడూరు సమీపంలోని టిడ్కో భవన సముదాయం వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మృతులు ప్రేమజంటగా భావిస్తున్నట్లు తెలియజేశారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారా.. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story