టీడీపీకి కంచుకోటగా మారిన నాలుగు నియోజకవర్గాలు.. తల పట్టుకుంటున్న వైసీపీ

by Hamsa |
టీడీపీకి కంచుకోటగా మారిన నాలుగు నియోజకవర్గాలు.. తల పట్టుకుంటున్న వైసీపీ
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ యమ స్ట్రాంగ్‌గా మారింది. దీంతో అక్కడ ఏం చేద్దాం? అనే ఆలోచనలో అధికార పార్టీ పడింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అక్కడ జెండా ఎగురవేయాలని వైసీపీ అధిష్టానం నానా రకాలుగా కుయుక్తులు పన్నుతున్నా, చివరికి టీడీపీకే జనాదరణ దక్కుతోంది. ఎన్ని సర్వేలు చేయించినా తెలుగుదేశానికే అనుకూలంగా వస్తున్నాయి. ఓ పక్క అధికార పార్టీ ‘గడపగడపకు.. మన ప్రభుత్వం’ అంటూ శాసనసభ్యులు తిరుగుతుంటుంటే జనం స్పందన కరువవుతోంది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ‘ఇదేం కర్మరా బాబూ.. మన రాష్ట్రానికి’ అంటుంటే జనం ఎగబడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, పాలకొల్లు, గోపాలపురం, దెందులూరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వైసీపీ అధిష్టానం జుట్టు పీక్కుంటోంది. ఎలాగైనా అక్కడ జెండా ఎగుర వేయాలనే వారి ప్రయత్నాలకు బ్రేకులు పడుతున్నాయి. జనం మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు. పలు సర్వేలు కూడా వారికి అనుకూలంగా చెబుతున్నారు. ఈ విషయమై ‘దిశ’ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.

పాలకొల్లులో నిమ్మలకు ఈసారీ లైన్ క్లియరేనా?

గత రెండు పర్యాయాల నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ సారి కూడా గెలుపు సునాయాసం అనే ప్రచారం జరుగుతోంది. నిమ్మల నియోజకవర్గంలో జనాలు అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా మంచి పట్టు సాధించారు. ప్రజా పోరాటాల్లో ఆయన దిట్ట అనిపించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌‌కు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేస్తూ తన దైన శైలిలో పోరాట యోధుడు అనిపించుకుంటున్నారు. అదే సమయంలో జనంతో పాటు, అధినేత చంద్రబాబు వద్ద కూడా మంచి మార్కులు సాధించుకొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా కాపు కోటాలో మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే ప్రచారం కూడా పార్టీలో ఉంది. దీంతో జనం నిమ్మలకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా నిమ్మలకు చెక్ పెట్టేందుకు స్థానిక వైసీపీ ఇన్‌చార్జి కవురు శ్రీనివాస్‌కు శాసన మండలిలో స్థానం కల్పించారు. ఒకానొక దశలో కవురు శ్రీనివాస్‌కు బీసీ కోటాలో మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే వైసీపీ ఎంత ప్రయత్నం చేసినా నిమ్మలకు మాత్రం జనంలో పట్టు ఏ మాత్రం సడలడం లేదనే విషయం అవగతమవుతోంది.

గోపాలపురంలో యువ నేత జోరు

గోపాలపురంలో యువనేత మద్దిపాటి వెంకట రాజు బహిరంగ సభ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండటంతో వైసీపీ ఆలోచనలో పడింది. ఎలాగైనా వెంకట్ రాజుకు చెక్ పెడదామనే వారి కుయుక్తులకు మార్గం లేకుండా పోతోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. జి.కొత్తపల్లి అనే గ్రామంలో కమ్మ సామాజికవర్గం నడుమ జరిగిన వివాదంలో వెంకట్రావు జోక్యం ఉండటంతో అక్కడ శాంతిభద్రతలు లోపించాయి. దీంతో స్థానిక శాసన సభ్యుడు బ్యాడ్ అయ్యారు. ఈ ప్రభావం పార్టీ మీద కూడా పడింది. దీంతో ఇక్కడ టీడీపీ మరింత స్ట్రాంగ్ అయింది. దీనికి తోడు యువ నాయకుడు వెంకట్రాజు కూడా జనంలో బాగా కలిసి పోతున్నారు. అధినేత చంద్రబాబు వద్ద మంచి నమ్మకం గల నాయకుడిగా పేరు తెచ్చుకొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా విద్యావంతులు, దళితుల కోటాలో యువ నేత అయిన వెంకట్ రాజునకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

తణుకులో ఆరిమిల్లి పదిలం

వైసీపీ బీసీ మంత్రి, దేవదాయ శాఖకు చెందిన ఆర్మూర్ నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న తణుకు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఇక్కడ ఇన్‌చార్జి ఆరిమిల్లి వివాదరహితుడుగా జనంలో మంచి పేరు తెచ్చుకొంటున్నారు. దీనికి తోడు మంత్రి నాగేశ్వరరావు నియోజకవర్గంలో కార్యకర్తల్లో అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. గత ఎన్నికల్లో జెండా మోసిన కార్యకర్తలు నేడు దూరం అయ్యారు. దీంతో పార్టీ అధిష్టానం తల పట్టుకుంది. టీడీపీ ఇన్‌చార్జి ఆరిమిల్లి రాధాకృష్ణ ‘ఇదేం ఖర్మరాబాబూ.. మన రాష్రానికి’ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కుటుంబాలను సందర్శించినట్లు సర్వే రిపోర్టు వచ్చింది. కార్యకర్తలతో మంచి సంబంధాలు పెట్టుకుంటున్నట్లు సమాచారం. దీంతో తణుకు విషయంపైనా అధికార పార్టీ ఆలోచనలో పడింది.

దెందులూరులో ఎమ్మెల్యే తండ్రితో చిక్కు..

దెందులూరులో వైసీపీ ఎమ్మెల్యే కొటారి అబ్యాయి చౌదరి తండ్రి మట్టి అక్రమ వ్యాపారం విషయమై చిక్కొచ్చి పడింది. స్థానికంగా పార్టీ నాయకులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీకి ఇది పదునైన ఆయుధంగా మారింది. పార్టీ ఇన్‌చార్జి చింతమనేని ప్రభాకర్ దీన్ని చక్కగా వాడుకుంటున్నారు. జనంలోకి బాగా తీసుకొని వెళుతున్నారు. దీనికి తోడు ‘ఇదేం ఖర్మరా బాబూ.. మన రాష్రానికి’, బాదుడే బాదుడు.. వంటి కార్యక్రమాలకు స్వయంగా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. దీంతో స్థానికంగా టీడీపీలో

మరింత ఉత్సాహం పెరిగింది. స్వతహాగా చింతమనేని ప్రభాకర్ అంటే జిల్లా అంతా ప్రత్యేకంగా పేరుంది. స్థానికంగా కొంత వ్యతిరేకత ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి అవన్నీ సర్దుకు పోతాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో దెందులూరులో టీడీపీ బలంగా ఉందని భావించవచ్చు.. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఇక్కడ చింతమనేనికి చెక్ పెట్టడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. అయితే భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story