వాళ్లను పిచ్చికుక్కల బండిపై లాక్కెళ్లి మొకాళ్లపై దండం పెట్టిస్తా: బుద్ధా వెంకన్న వార్నింగ్

by Seetharam |   ( Updated:2023-10-08 13:12:56.0  )
వాళ్లను పిచ్చికుక్కల బండిపై లాక్కెళ్లి మొకాళ్లపై దండం పెట్టిస్తా: బుద్ధా వెంకన్న వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ రాజకీయ జన్మనిస్తే...ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని తన స్వార్థ రాజకీయం కోసం చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో ఆదివారం బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. మాట్లాడితే తనకు రాజకీయ బిక్ష పెట్టింది హరికృష్ణ అంటున్న కొడాలి నాని... మరి హరికృష్ణ పార్టీ పెట్టినప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. మరోవైపు పేర్ని నానిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను నోరు విప్పితే పేర్ని నాని రోడ్డు మీద నడవలేవు... అయినా నీ బతుకు ఎవరికి తెలియంది కాదు అంటూ ఘాటుగా విమర్శించారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నాయకుల భరతం పడతాం అని వార్నింగ్ ఇచ్చారు. పిచ్చికుక్కల బండిపై బెంజ్ సర్కిల్ వరకు లాక్కెళ్లి మొకాళ్లపై దండం పెట్టిస్తామని బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగడం లేదన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం, జగన్ రెడ్డి రాజ్యాంగాలు అమలవుతున్నాయని చెప్పుకొచ్చారు.టీడీపీ వాళ్లు చేస్తే తప్పు ... అదే వైసీపీ వాళ్ళు చేస్తే తప్పు కాదా? ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించారు. మంత్రి రోజాపై తమ నేత వ్యాఖ్యలు చేస్తే ఉలిక్కిపడుతున్న వైసీపీ నేతలు మరి రాజకీయాలకు సంబంధం లేదని నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను తిట్టినప్పుడు ఆ బాధ మీకు తెలియడం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ మహిళా నేతలను తిడితే అరెస్టులు ఉండవు..మంత్రి రోజాను తిడితే మాత్రం జైల్లో పెడతారా ఇదెక్కడి పాలన అంటూ మండిపడ్డారు. పురాణాల్లో కూడా లేని రాక్షసులు జగన్ రెడ్డిలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ సైకో రెడ్డి ఆదేశాలను పాటిస్తూ పోలీసులు కూడా తప్పు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వమే నిరంతరం ఉండదు... పోలీసులు ఇది గమనించి నడుచుకోవాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ నేతలు స్పందించాలని కోరారు. చంద్రబాబు రాజకీయ భిక్షతో ఇప్పటికీ ఎందరో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు.

Advertisement

Next Story