జైల్లో పెట్టి నన్ను మానసిక క్షోభకు గురి చేశారు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

by Seetharam |
జైల్లో పెట్టి నన్ను మానసిక క్షోభకు గురి చేశారు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్కిల్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడిగుంటూరు జిల్లాలో శుక్రవారం చంద్రబాబు నాయుడు పర్యటించారు.దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అన్నదాతలకు భరోసా ఇవ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు, బాపట్ల, పాత ప్రకాశం జిల్లాల్లో శుక్ర, శనివారాలు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పాడైన పంటలను పరిశీలించారు. రైతుల బాధలు విని చలించిపోయారు. తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబు నాయడు మీడియాతో మాట్లాడారు. మిచాంగ్ తుఫానుతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని...చేతికి పంట వచ్చే సమయంలో తుపాను వచ్చి రైతన్నకు అపారనష్టం కలిగించిందని అన్నారు.మిచౌంగ్ తుఫాను ఉందని భారత వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం అలర్ట్ అవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని దాని ఫలితమే నేడు రైతులు దారుణమైన దుస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు.నేడు రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందంటే అందుకు వైసీపీ ప్రభుత్వం ఉదాసీనతే కారణమని ఆరోపించారు. మరోవైపు డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతోనే పొలాల్లోకి మురికి నీరు చేరిందని చెప్పుకొచ్చారు. రైతాంగం తీవ్రంగా నష్టపోయినప్పటికీ ఒక్క మంత్రిగానీ.. ఎమ్మెల్యేగానీ రైతాంగాన్ని పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ప్రభుత్వ అధికారులు సైతం ఎవరూ వచ్చి స్పందించలేదని చెప్పుకొచ్చారు.

జగన్ పర్యటనపై విమర్శలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి జిల్లా పర్యటనపై చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తుఫానుతో నష్టపోయిన ప్రాంతాల్లో కాకుండా సీఎం ఎక్కడో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ రైతాంగానికి ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదని చెప్పుకొచ్చారు. తుఫాను వల్ల రైతులకు ఎకరాకు సుమారు రూ.50 వేలు నష్టపోయారని చెప్పుకొచ్చారు. ఈ నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఈ సందర్బంగా కొంతమంది రైతులు, టీడీపీ నేతలు ‘జగన్ పోవాలి.. బాబు రావాలి’ అంటూ నినాదాలు చేశారు.

విమర్శిస్తే జైల్లో పెడతారా?

52 రోజులపాటు స్కిల్ స్కాం కేసులో తనను రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌కు పంపడంపై చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఏనాడూ తప్పు చేయలేదని అన్నారు. తప్పు చేసినా ఉపేక్షించేవాడిని కాదని చెప్పుకొచ్చారు. అలాంటి తనను.. ఏ తప్పు చేయకున్నా తనను జైలులో పెట్టి క్షోభకు గురిచేశారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించకూడదా? ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జైలులో పెడతారా? అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed