కోడి కత్తి కేసులో కుట్ర లేదు

by Prasanna |   ( Updated:2023-04-14 13:19:32.0  )
కోడి కత్తి కేసులో కుట్ర లేదు
X

దిశ, ఏపీ బ్యూరో: నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో ఎలాంటి కుట్ర లేదని ప్రత్యేక కోర్టులో ఎన్​ఐఏ అవిడవిట్ ​దాఖలు చేసింది. జగన్ ​ఫిర్యాదును కొట్టేయాలని న్యాయ స్థానానికి విన్నవించింది. 2018లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసును ఎన్​ఐఏ (జాతీయ పరిశోధన సంస్థ) దర్యాప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి జగన్ ​దాదాపు ఐదేళ్లు కోర్టుకు హాజరు కాలేదు. బాధితుడి వాంగ్మూలం లేకుండా కేసును ఎలా విచారించాలని ఎన్​ఐఏ కోర్టు ఆక్షేపించింది. న్యాయస్థానానికి బాధితుడు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. చివరకు ఎన్​ఐఏ అఫిడవిట్​లో ఈ కేసు గురించి అసలు దర్యాప్తు అవసరం లేదన్న అభిప్రాయన్ని వెలిబుచ్చింది.

పాపం.. శ్రీను..

ఈ కేసులో నిందితుడు జానిపల్లి శ్రీనివాస్​ నాలుగున్నరేళ్ల నుంచి బెయిల్​ లేకుండా కారాగారంలోనే ఉన్నాడు. బాధితుడు​కోర్టుకు హాజరు కావాల్సిందేనన్న ఆదేశాలకు సీఎం జగన్ ​స్పందించారు. తాను కోర్టుకు హాజరు కాలేనంటూ కమిషన్​ ద్వారా గురువారం వాంగ్మూలం పంపారు. అందులో ఎయిర్​పోర్టు రెస్టారెంట్​ యజమాని పేరు హర్షవర్ధన్​ప్రసాద్​ అయితే హర్షవర్దన్​ చౌదరి అని పేర్కొన్నారు. ఘటన చోటు చేసుకున్న సమయంలో సీసీ కెమెరాలు పనిచేయలేదని జగన్ ​స్టేట్​మెంటులో పేర్కొనడాన్ని ఎన్​ఐఏ అఫిడవిట్​లో కొట్టి పారేసింది. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినట్లు పేర్కొంది. ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్ర లేదని కూడా ఎన్​ఐఏ పేర్కొంది. ఎన్​ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది.

నాడు వైసీపీ గగ్గోలు..

మరోవైపు కోడికత్తి కేసు గురించి ఎన్​ఐఏ సరిగ్గా దర్యాప్తు చేయలేదని సీఎం జగన్​ తరపున మరో పిటిషన్​ దాఖలైనట్లు తెలుస్తోంది. ఎన్​ఐఏ అఫిడవిట్ ​ప్రకారం నిందితుడు శ్రీను జగన్​ దగ్గర పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనలో అప్పటి అధికార పార్టీ టీడీపీ హస్తముందని వైసీపీ గగ్గోలు పెట్టింది. ఎన్నికల్లో లబ్ది పొందడానికి సానుభూతి కోసం జగన్ కావాలనే కోడి కత్తి డ్రామా ఆడినట్లు టీడీపీ నేతలు ఆరోపణలు సంధించారు. చివరకు ఎన్​ఐఏ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​తో కేసును తుస్సుమనిపించింది. రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో నిందితుడైన జానిపల్లి శ్రీనివాస్​కు బెయిల్​మంజూరుకు మార్గం సుగమం అయింది. ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు కేసును కొట్టేస్తుందా లేక ఎన్​ఐఏ సరిగ్గా దర్యాప్తు చేయలేదంటూ జగన్ తరపున దాఖలైన పిటిషన్​పై విచారణ కొనసాగిస్తుందా అనే అంశం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read..

బీఆర్ఎస్ లోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ...!

Advertisement

Next Story