అప్పట్లో గ్రౌండ్‌లో.. ఇప్పుడు పాలిటిక్స్‌లో: తొడగొట్టి ఛాలెంజ్ విసిరిన మంత్రి ఆర్‌కే రోజా

by Seetharam |
అప్పట్లో గ్రౌండ్‌లో.. ఇప్పుడు పాలిటిక్స్‌లో: తొడగొట్టి ఛాలెంజ్ విసిరిన మంత్రి ఆర్‌కే రోజా
X

దిశ , డైనమిక్ బ్యూరో : రాజకీయాల్లో మాటల తూటాలు పేల్చడమే కాదు..గ్రౌండ్‌లో దుమ్ముధులపడమూ ఆమెకు తెలుసు. కబడ్డీ కోర్టులోకి దిగారంటే ఇక మామూలుగా ఉండదు. స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్ వేశారంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టకుండా ఉండరంటే నమ్మండి. అంతేకాదండోయ్ వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేర్గాంచిన ఆమె ఏం చేసినా సంచలనమే. అంబులెన్స్ నడపాలన్నా.. ట్రాక్టర్ తోలాలన్నా.. బస్సు నడిపినా... దిశా వాహనం నడిపినా.. చివరికి బుల్లెట్‌ బండిపై హల్ చల్ చేసినా అది ఆమెకు మాత్రమే సొంతం. మగవారికి తాను ఏం తక్కువ కాదని అన్నింట్లో తన అగ్రస్థానాన్ని, తన టాలెంట్‌ను ప్రదర్శిస్తుంటారు. ఇంతకీ ఆ నేత ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదూ ఇంకెవరు మన మంత్రి ఆర్‌కే రోజా. మంత్రి రోజా కేవలం నటనలోనే కాదు రాజకీయాల్లోనూ సక్సెస్ ఫుల్ ఉమెన్. అంతేకాదు మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా. కబడ్డీ ఆట ఆడటంలో ఆమె తర్వాతే అనాలి. కబడ్డీ కోర్టులో కూత పెట్టారంటే చాలు అవతలి వాళ్లు హడలిపోవాల్సిందే. గతంలో భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ ఆడిన రోజా ఇప్పుడు ఒంటరిగా ఏకంగా తొడగొట్టి మరీ కూతకెళ్లారు. ప్రస్తుతం కబడ్డీ కోర్టులో రోజా తొడగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గ్రౌండ్‌లో విజిల్స్ మోత

ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్, రాష్ట్ర యువజన, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా కాకినాడ జిల్లాలో సందడి చేశారు. కాకినాడలోని ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ(పురుషులు) టోర్నమెంట్-2023లో పాల్గొన్న మంత్రి రోజా ఆటగాళ్ళతో పాటు కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. కబడ్డీ కోర్టులో తొడగొట్టి మరీ కూతకు వెళ్లారు. దీంతో గ్రౌండ్‌లో విజిల్స్ మోత మోగాయి. కబడ్డీ మాత్రమే కాదు ఏ ఆటైనా ఆడే మంత్రి ఆర్‌కే రోజా క్రీడల పట్ల తన మక్కువను ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇక తాజాగా ఆమె తొడ కొట్టి మరీ కబడ్డీ ఆడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాల్లో మంత్రి రోజా భర్త సెల్వమణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భర్త సెల్వమణితో కలిసి మంత్రి ఆర్‌కే రోజా కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన సంగతి తెలిసిందే. తాజాగా కాకినాడ ఆదిత్య విద్యా ప్రాంగణంలో మళ్లీ కబడ్డీ ఆటలో కూతపెట్టారు. అంతేకాదు ప్రత్యర్థి జట్టుకు మంత్రి రోజా తొడగొట్టి సవాల్ విసురుతూ మరీ కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహం నింపారు.

కబడ్డీ మన సంస్కృతికి ప్రతిబింబం

కబడ్డీ మన సంస్కృతికి ప్రతిబింబం అని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. క్రీడలు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలుగా పేర్కొన్నారు. తనకు కబడ్డీ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం అని మంత్రి రోజా వెల్లడించారు. అప్పట్లో గ్రౌండ్లో కబడ్డీ ఆడితే, ప్రస్తుతం పాలిటిక్స్‌లో కబడ్డీ ఆడుతున్నానని మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ మంత్రి ఆర్‌కే రోజా పంచ్ డైలాగ్ వేశారు. ఇక ఈ సమయంలోనే వచ్చే డిసెంబర్‌లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంతో రాబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి సచివాలయ పరిధిలో ఆడదాం ఆంధ్ర క్రీడలు నిర్వహిస్తున్నట్లు మంత్రి రోజా వెల్లడించారు. యువతకు చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరమని..గ్రామీణ స్థాయి నుంచి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వారిని క్రీడల్లో ఉన్నత స్థాయికి వారిని తీసుకువెళ్తామని మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు.

Advertisement

Next Story