ఆ నియోజకవర్గం టీడీపీలో టికెట్ రేసు: నలుగురు పోటీ..ఎవరిని వరిస్తుందో?

by Seetharam |
ఆ నియోజకవర్గం టీడీపీలో టికెట్ రేసు: నలుగురు పోటీ..ఎవరిని వరిస్తుందో?
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లాలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరు జిల్లాలో వైసీపీ టీడీపీల మధ్యవార్ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికే మళ్లీ టికెట్ అనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఎవరనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించే ఆశావాహుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో టీడీపీ తరఫున టికెట్ ఎవరిని వరిస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ప్రొద్దుటూరు టీడీపీలో టికెట్ రేస్ దాదాపు మెుదలైంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ నీదా నాదా అన్నట్లు నేతలు పోటీ పడుతున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి నలుగురు టీడీపీ అభ్యర్థులు రేస్‌లో ఉండటంతో అభ్యర్థి ఎవరా అనేది నియోజకవర్గంలో టీడీపీలో చర్చ మెుదలైంది.

త్రిముఖ పోరు

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ పోరు నెలకొంది. టికెట్ కోసం నాలుగుస్తంభాలట జరుగుతుంది. నలుగురు టికెట్ రేసుతో తామున్నామని ప్రకటించుకుంటున్నారు. ఈ టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, లింగారెడ్డి ముందువరుసలో ఉన్నారు. టికెట్ తనదంటే తనదే అని ఇద్దరు నేతలు శపథాలు చేసుకుంటున్నారు. వరదరాజులు రెడ్డి రాజకీయంగా సీనియర్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వరుస విజయాలు సాధించారు. దీంతో ఆయనకు ప్రొద్దూటూరులో బలమైన క్యాడర్ ఉంది. అలాగే లింగారెడ్డి సైతం గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరదరాజులురెడ్డితో పోల్చుకుంటే అంతగా క్యాడర్ లేదని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య టికెట్ వార్ ఇలా ఉంటే తాను సైతం అంటున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇన్‌చార్జిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. టీడీపీ కష్టకాలంలో తాను పార్టీకి అండగా నిలబడ్డానని చెప్పుకొస్తున్నారు. పార్టీ కోసం జైలుకు సైతం వెళ్లొచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు టికెట్ కేటాయిస్తారని ఆశిస్తున్నారు. అంతేకాదు గతంలో నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అటు చంద్రబాబు నాయుడు, ఇటు నారా లోకేశ్‌ ఇద్దరూ తనకు టికెట్ హామీ ఇచ్చారని అనుచరుల వద్ద చెప్పుకొంటున్నారు. దీంతో నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొన్నట్లు అయ్యింది.

నేను సైతం అంటున్న సురేశ్

ప్రొద్దుటూరులో త్రిముఖ పోరులో ఎవరిని టికెట్ వరిస్తుందో అని నియోజకవర్గంలో చర్చ జరుగుతున్న తరుణంలో తాను కూడా రేసులో ఉన్నానని సీఎం సురేశ్ తెరపైకి వచ్చారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ సోదరుడు సీఎం సురేశ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడు సీఎం రమేశ్‌కు చంద్రబాబు నాయుడు కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో టికెట్ తననే వరిస్తుందని ధీమాగా ఉన్నారు. మెుత్తానికి ప్రొద్దుటూరు టికెట్ కోసం టీడీపీలో ఓరేస్ నడుస్తోందనే చెప్పాలి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఆశిస్తుండటంతో ఎవరిని టికెట్ వరిస్తుందో? ఆ అదృష్టవంతుడు ఎవరో అనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతుంది.

Advertisement

Next Story