ఎందుకు బాధ్యత తీసుకోరు.. జగన్ సర్కార్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు!

by GSrikanth |   ( Updated:2022-09-26 10:01:54.0  )
ఎందుకు బాధ్యత తీసుకోరు.. జగన్ సర్కార్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి సీనియర్‌ న్యాయవాదులను రంగంలో దించడంలో ఉన్న ఆసక్తి పర్యావరణ పరిరక్షణపై లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణానికి కలిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదని ఏపీ ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదులకు డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పర్యావరణ నష్టాన్ని ఎందుకు భరించదని నిలదీసింది. ప్రాజక్టు నిర్మాణంలో పర్యావరణానికి జరిగిన నష్టంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ప్రిన్సిపల్‌ బెంచ్‌ విధించిన రూ.120 కోట్లు జరిమానాపై ఎన్జీటీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ అంశంలో సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సిటీ రవికుమార్‌ ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది.

పోలవరం ప్రాజెక్ట్ కేసులో ఇప్పటి వరకు ఎంత డబ్బు న్యాయవాదుల కోసం ఖర్చు పెట్టారో తెలుసుకునేందుకు నోటీసు ఇస్తామన్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక్క కేసుకు ఎంత మంది సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేస్తారని కోర్టు ప్రశ్నించింది. పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతల ప్రాజెక్టులపై హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పులపై దాఖలైన అన్ని అప్పీళ్లను కలిపి ఒకేసారి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇప్పటికీ ఇంకా పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని డాక్టర్ పెంటపాటి పుల్లారవు తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రాజెక్టు వల్ల యాభై వేల మందికి పైగా ముంపునకు గురయ్యారని పుల్లారావు తరఫు న్యాయవాది వివరించారు. అయితే ఏపీ ప్రభుత్వం దాఖాలు చేసిన మూడు అప్పీళ్ళను విచారించేందుకు కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed