Huge Sketch: సీఎం జగన్​ వ్యూహంలో మార్పు.. ఆ పార్టీకి చెక్ పెట్టేందుకేనా..?

by srinivas |
Huge Sketch: సీఎం జగన్​ వ్యూహంలో మార్పు.. ఆ పార్టీకి చెక్ పెట్టేందుకేనా..?
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ప్రధాన పార్టీల వ్యూహాలు సామాన్యుడు ఊహించలేనంత లోతుగా ఉంటున్నాయి. ఏ పార్టీ చర్యల వెనుక అసలు ఉద్దేశమేంటో సగటు ప్రజల ఊహకు కూడా అందడం లేదు. ఇటీవల వరుసగా చంద్రబాబు, నారా లోకేష్​యాత్రలకు పోలీసుల ఆటంకాలు మరింతగా పెరిగాయి. దీనివల్ల అధికార వైసీపీకి నష్టమని తెలిసినా ఎందుకిలా చేస్తున్నారంటే.. దీని వెనుక చాలా భారీ స్కెచ్​ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ మధ్యలోకి బీజేపీ–జనసేన వస్తే ఏకు మేకవుతారని అధికార పార్టీ​అంచనా. పొరుగునున్న కేసీఆర్​అనుభవాలను గమనించే ఈ ఎత్తుగడ అమలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దాగుడు మూతల దండాకోర్​బీజేపీకి చెక్​పెట్టడానికే !

రాష్ట్రంలో బీజేపీ ఎప్పటినుంచో దాగుడు మూతల రాజకీయం చేస్తోంది. జనసేనను సంకన పెట్టుకొని వైసీపీ, టీడీపీలతో గేమ్​ఆడుతోంది. టీడీపీ బలహీనపడితే ఆ స్థానాన్ని బీజేపీ–జనసేన ఆక్రమించాలనేది వారి ఎత్తుగడ. అందుకే జగన్​ ద్వారా టీడీపీ ఆయుపట్టు మీద దెబ్బ కొట్టేందుకు ఉసిగొల్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమనే దాన్ని బూచిగా చూపారు. టీడీపీ మీద నుంచి వైసీపీ ఫోకస్​జనసేన మీదకు మళ్లించేట్లు పావులు కదిపారు. అందులో భాగంగానే వైసీపీ సర్కారుకు తెర వెనుక సాయం చేస్తున్నట్లు నటించారు.

ఓవైపు విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా వైసీపీని జనంలో పలుచన చేశారు. మరోవైపు విపరీతమైన షరతులతో అప్పులకు మాత్రమే అనుమతులిస్తూ అపర దానకర్ణుడు ఫోజు పెడుతున్నారు. ఇంకోవైపు రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ప్రజల నడ్డి విరిచే భారాలు విధిస్తూ వచ్చారు. ఇవన్నీ పట్టించుకోని జగన్​సంక్షేమ పథకాలతో జనంలో తన బలం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టారు. తీరా కళ్లు తెరిచే సరికి పుట్టి మునుగుతుందని అర్థమైనట్లుంది. అందుకే వ్యూహం మార్చుకున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

కేసీఆర్​అనుభవాలను చూశాకనే జగన్​వ్యూహంలో మార్పు

పొరుగునున్న తెలంగాణలో కేసీఆర్​ప్రత్యర్థి కాంగ్రెస్‌ను వెనక్కి కొట్టడానికి బీజేపీ మీద ఫోకస్​పెట్టారు. నేడు అది ఏకు మేకయింది. చివరకు కేసీఆర్​కుర్చీని కబళించే స్థాయికి ఎదిగింది. ఇక్కడ టీడీపీని వెనక్కి నెట్టి జనసేన–బీజేపీని లేపడం వల్ల తెలంగాణ పరిస్థితే ఇక్కడా పునరావృతమవుతుందని సీఎం జగన్​అంచనా. అందుకే కొద్ది రోజుల నుంచి జనసేనను పక్కన పెట్టి టీడీపీ మీదనే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే నారా లోకేష్​పాదయాత్రకు పోలీసులతో ఆటంకాలు సృష్టించి జనంలో చర్చనీయాంశం చేశారు. అనపర్తిలో చంద్రబాబు రోడ్డుషో, సభలకు ఆటంకాలు సృష్టించి కేసులు పెట్టారు. ఇవన్నీ టీడీపీకి కొంత మైలేజ్​పెంచడానికేనని స్పష్టమవుతోంది.

వైసీపీకి ప్రత్యర్థిగా టీడీపీనే ఉండాలని..

టీడీపీకి కొంత మైలేజ్​వచ్చేట్లు చేసినా గెలుపు తమదేనన్న ధీమాతో జగన్​ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ ప్రస్తుతం ఉన్న 21 మంది ఎమ్మెల్యేలకు ఎంత పెరిగినా 60 సీట్లకు మించదని వైసీపీ అంచనా. జనసేనతో కలిసినా మరో ఐదు నుంచి పది సీట్లు అదనంగా పెరగొచ్చు. వైసీపీ మాత్రం వంద సీట్లకు పైగా సాధించి మళ్లీ అధికారాన్ని చేపడుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకోసం మార్చి నుంచి జగన్​పల్లె నిద్ర పేరుతో జనంలోకి వెళ్లనున్నారు.175 నియోజకవర్గాల్లో 180 రోజుల కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. దీంతో టీడీపీని ప్రత్యర్థిగా పెట్టుకొని మళ్లీ విజయాన్ని సొంతం చేసుకోవాలని పక్కా ప్రణాళికతో జగన్​అడుగులు వేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Next Story

Most Viewed