ఈనెల 21 నుంచి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి సీఎం కప్ పోటీలు

by Y. Venkata Narasimha Reddy |
ఈనెల 21 నుంచి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి సీఎం కప్ పోటీలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో క్రీడలను గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ నెల 21నుంచి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభించనున్నామని సాట్ చైర్మన్ శివసేనారెడ్డి వెల్లడించారు. సీఎం కప్ నిర్వాహణ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో రేపు సాయంత్రం 4గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలోని పల్లెల్లో ఈ సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా ఈనెల 21 నుంచి ఆరు అథ్లెటిక్స్ విభాగాల పోటీలను, కోకో, వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. 21 నుంచి 24 వరకు గ్రామీణ స్థాయి పోటీలు, 24 నుంచి 30 వరకు మండల స్థాయి పోటీలు, నవంబర్ 8నుంచి 13 వరకు జిల్లా స్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. 28 నవంబర్ నుంచి డిసెంబర్ 5వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

పల్లెల్లో యువత స్వచ్ఛందంగా క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ముందుకు రావాలని, రాజకీయాలకు తావులేకుండా క్రీడాపోటీలు నిర్వహిస్తామని, సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ముందుకెళ్తున్నామన్నారు. గ్రామీణ క్రీడాకారుల కోసం యజ్ఞం లాగా సీఎం కప్ పోటీలు రెండు నెలల ఆటల పండుగ సంబరంగా కొనసాగుతాయన్నారు. 21 నుంచి ప్రతి గ్రామంలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సీఎం కప్ పోటీలను ప్రారంభిస్తారని, జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ అధ్వర్యంలో ప్రారంభిస్తారని చెప్పారు. స్వరాష్ట్రంలో గత పాలకులు క్రీడల పట్ల చూపిన నిర్లక్ష్యంతో పదేళ్ళ పాటు నిరుత్సాహంతో ఉన్న క్రీడాకారులను తమ 8నెలల ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఇంతకాలం క్రీడల నిర్వహణ లేక క్రీడా ప్రాంగణాలు కబ్జాలకు గురవుతున్నాయన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడల అభివృద్దికి రూ.361కోట్లు స్పోర్ట్స్ అథారిటీకి నిధులు కేటాయించారన్నారు. గ్రామీణ స్థాయి యువత చెడు అలవాట్లకు లోనవుతున్నారని, యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని క్రీడలు ఆడేలా చేస్తున్నామన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడా మైదానాలు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Next Story