- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సీఎం ప్రకటనకు భిన్నంగా క్షేత్ర స్థాయి పరిస్థితులు..
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికల్లో ఓట్లు వేయించే వర్గ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిస్తుంటుంది. సామాజిక ఓటు బ్యాంకులను బలోపేతం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ సమగ్ర అభివృద్ధికి దోహదపడే అంశాలపై ఉండదు. ఇటీవల సీఎం జగన్ మాట్లాడుతూ నాలుగేళ్లలో గ్రామీణ ఆర్థిక స్థితిగతుల్లో ఎంతో మెరుగు సాధించామని ఘనంగా చెప్పుకున్నారు. కొత్త ఒరవడిని సృష్టించినట్లు తెలిపారు. పంచాయతీలు, అభివృద్ధి కమిటీల స్థానంలో సచివాలయాలు, వలంటీర్లు వచ్చారు. ఆర్బీకే, విలేజ్ క్లినిక్, పశువుల ఆస్పత్రి కనిపిస్తున్నాయి. శీతల గిడ్డంగులు ఇంకా రాలేదు. వీటితోనే గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయా అంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. కీలకమైన భూసంబంధాల్లో మార్పులు రాకుండా.. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం కాకుండా రూరల్ ఎకానమీ ఎలా పురోగమిస్తుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
దిశ, ఏపీ బ్యూరో: బాపూజీ కన్న కలలను సీఎం జగన్ నెరవేరుస్తున్నట్లు ఓ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. గ్రామీణ ఆర్థిక పరిస్థితులు నాలుగేళ్లలో మెరుగుపడ్డాయని సీఎం వాయిస్ కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది. గ్రామసీమలు స్వయం పోషకంగా ఎదిగినప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని జాతిపిత కాంక్షించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా పల్లెటూళ్లు అభివృద్ధికి దూరంగా కునారిల్లుతున్నాయి. ఉపాధి కోసం గ్రామీణుల వలసలు మరింతగా పెరుగుతున్నాయి. కనీస మౌలిక సదుపాయాల కొరత వెక్కిరిస్తోంది. భూ వికేంద్రీకరణకు బదులు కేంద్రీకృతమవుతోంది. వ్యవసాయం గిట్టుబాటుకాక పేద రైతులు, కూలీలు నగరాల్లోని మురికివాడలకు చేరుతున్నారు. ఉపాధి మృగ్యమై అర్బన్లో అసంఘటిత రంగ కార్మికులుగా మారుతున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వ పరంగా తీసుకొచ్చిన మార్పులు పెద్దగా కనిపించడం లేదని ఆర్థిక రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు.
గిట్టుబాటు లేదు.. ప్రోత్సాహకాలూ లేవు..
రాష్ట్రంలో మొత్తం సాగు భూమి 62.08 లక్షల హెక్టార్లు ఉంది. మొత్తం భూభాగంలో ఇది కేవలం 38.01 శాతం మాత్రమే. ప్రభుత్వ విధి విధానాల కారణంగా సంప్రదాయ వ్యవసాయ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరి పేరు మీదకు భూమిని బదలాయించుకున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ భూమి కలిగిన వాళ్లంతా చిన్నసన్నకారు రైతులుగా నమోదయ్యారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి సరైన ప్రోత్సాహకాలు లేక వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయింది. దీంతో ఆయా కుటుంబాల్లోని రెండో తరమంతా ఇతర రంగాల వైపు మళ్లారు. ఇప్పుడు పంటలు సాగు చేస్తున్న యువకులకు కనీసం వివాహం కూడా కాని పరిస్థితులు నెట్టుకొచ్చాయి.
కౌలు రైతులను పట్టించుకునే వారేరీ..
ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 60 లక్షల రైతు కమతాలున్నాయి. క్షేత్ర స్థాయిలో వీళ్లంతా పంటలు సాగు చేయడం లేదు. వాళ్ల నివాసాలు అర్బన్ ప్రాంతాలకు చేరాయి. సెంటు భూమి లేని 18 లక్షల మంది కౌలు రైతులున్నారు. మరో నాలుగైదు లక్షల మంది తమకున్న కొద్దిపాటి భూమితోపాటు మరికొంత కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. మొత్తంగా పంటల సాగులో 70 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. ప్రభుత్వం అందించే ఏ ప్రోత్సాహకాలైనా భూ యజమానులకు అందుతున్నాయి. కౌలు రైతుల్లో ఒక్క శాతానికి మించి రాయితీలు అందడం లేదు. సంస్థాగత పంట రుణాలు అందవు. పంట నష్ట పరిహారానికి నోచుకోవడం లేదు. చివరకు పండించిన పంటను అమ్ముకోవడానికీ హక్కు లేని దయనీయ స్థితిలో కౌల్దార్లున్నారు.
ప్రభుత్వమే లీజుకు తీసుకోవాలి..
ప్రభుత్వం నిజంగా గ్రామీణ ఆర్థిక పురోగమనాన్ని ఆశిస్తే.. ముందుగా సాగు చేయని భూమిని ప్రభుత్వమే లీజుకు తీసుకోవాలి. వ్యవసాయం చేస్తామనే కుటుంబానికి ఎకరా నుంచి రెండున్నర ఎకరాలకు మించి ఇవ్వకూడదు. ఇక్కడ కూలీలు ఉండరు. ఇంటిల్లిపాదీ పనిచేసుకోవడమే. విత్తనం దగ్గర నుంచి సేద్య పరికరాలు, ఎరువులు, రసాయనాలు, హార్వెస్టింగ్ ఇన్పుట్స్తో సహా ఆర్బీకేల ద్వారా అందించాలి. ఇందుకోసం బ్యాంకులు ఇచ్చే పంట రుణాలను ప్రభుత్వమే వినియోగించాలి. ముందుగా ప్రకటించిన ధరల ప్రకారం పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వమే వాటిని మార్కెటింగ్ చేయాలి.
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే..
పంటలు దెబ్బతింటే సర్వే నంబరు ప్రకారం పరిహారం చెల్లించేట్లు బీమా పథకాలు ఉండాలి. నిర్దేశించిన పంటలు సాగు చేసే ప్రతీ కుటుంబానికి నేరుగా నగదు రూపంలో రాయితీలు అందజేయాలి. వ్యవసాయ అనుబంధ రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఇవేం చేయకుండానే గ్రామీణ ఆర్థిక శక్తి ఎలా పెరుగుతుందో పాలక ప్రభుత్వ పెద్దలు సెలవియ్యాలి. కొన్ని మాటలు వినడానికి అందంగా ఉంటాయి. క్షేత్ర స్థాయిలో ఆచరణే చేదుగా ఉంటుంది. ఇప్పటికైనా సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ అమలు చేయాలని గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు.
Also Read: ఏపీలో..మంటలు రేపిన ‘వారాహి’ యాత్ర..