Breaking: అష్టదిగ్బంధంలో విశాఖ.. రెడ్ జోన్‌గా ఏయూ

by srinivas |
Breaking: అష్టదిగ్బంధంలో విశాఖ.. రెడ్ జోన్‌గా ఏయూ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మంగళవారం ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు లెక్కింపు జరగనుంది. ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్ల దృష్యా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా విశాఖ నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే అదనపు బలగాలు మోహరించారు. ఏపీఎస్పీ బెటాలియన్లతో పాటు పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే విశాఖ మొత్తం కార్డెన్ సెర్చ్‌తో జల్లెడ పట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. మూడు ప్రదేశాల్లో ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రాయూనివర్సిటీతో పాటు అనకాపల్లి, పాడేరులో పోలింగ్ కేంద్రాల్లో లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు. ఆంధ్రాయూనివర్సిటీలో 7 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనకాపల్లిలో 6 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం, అరకు ఎంపీతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలకు పాడేరులో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


మే 13న జరిగిన ఎన్నికల్లో 30 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 30 వేల మంది వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. అరకు, పాడేరు మావోయిస్టు ఎఫెక్ట్ ఏరియాలు కావడంతో ఆ రెండు ప్రాంతాలను పోలీసు దిగ్బంధంలో పెట్టుకున్నారు. ఆంధ్రయూనివర్సిటీ నుంచి 2 కిలో మీటర్ల వరకూ రెడ్ జోన్ ప్రకటించి ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాదు నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించారు. ఒక కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన వాళ్లు బయటకు వెళ్లి మళ్లీ లోపలకి వెళ్తామంటే అనుమతి నిరాకరించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు గొడవలకు దిగితే కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే విశాఖలో వేలాది మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అటు ట్రాఫిక్‌ను సైతం నియంత్రణలో పెట్టుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed