తీరానికి తరలివచ్చిన డెలిగేట్స్

by sudharani |   ( Updated:2023-03-03 08:23:06.0  )
తీరానికి తరలివచ్చిన డెలిగేట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పిలవబడుతున్న విశాఖపట్నం ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు వేదికగా మారింది. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ముఖ్య డెలిగేట్స్‌తో కలిసి సీఎం జగన్ ప్రారంభించారు. ఎడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో 14 రంగాల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, సయంట్‌ అధినేత మోహన్‌రెడ్డి, అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమారమంగళం బిర్లా, టాటా గ్రూపు చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్లా,జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌‌తోపాటు పలువురు సదస్సుకు హాజరయ్యారు.

జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ప్రసంగించారు. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ - 2023కు హాజరవుతున్న ఆహుతులకు సాంప్రదాయ నృత్యరూపకాలతో కళాకారులు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇకపోతే మెుదటి రోజు అయిన శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం మైదానంలో అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు ఆరగిస్తారు. ఇకపోతే శనివారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ముగియనుంది.

నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు : మంత్రి గుడివాడ అమర్నాథ్‌

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నాయకత్వంలో పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఏపీలో సత్వరమే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అపార ఖనిజ సంపద ఉందని.. పెట్టుబడులకు అవకాశాలు అపారమని చెప్పుకొచ్చారు. పారిశ్రామికంగా అనుకూల అవకాశాలున్నాయని ఇన్వెస్టర్స్‌కు తెలియజేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా ఉందని చెప్పడానికి తాము ఎంతో సంతోషిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇండియా ఇండస్ట్రీయల్‌ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని.. పలు రంగాల్లో లాజిస్టిక్స్‌ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు రాష్ట్రంలోఎలాంటి కొదవలేదన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. బిజినెస్‌ ఇండస్ట్రీపై సీఎం జగన్‌ మంచి దార్శనికతతో ఉన్నారని.. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఏపీలో జిందాల్‌ స్టీల్‌ భారీ పెట్టుబడులు: చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌

ఇకపోతే ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌లో రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేందుకు పలు కంపెనీలు తమ ఆసక్తి కనబరిచాయి. జిందాల్‌ కంపెనీ రానున్న రోజుల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ ప్రకటించారు. ఏపీ ప్రగతిలో భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయని.. పారిశ్రామిక అనుకూల వాతావరణం భేషుగ్గా ఉందని కితాబిచ్చారు. ఏపీలో ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ ఉందని చెప్పుకొచ్చారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి కల్పించబోతున్నట్టు వెల్లడించారు. ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని నవీన్ జిందాల్ ప్రకటించారు.

సీఎం విజన్ అద్భుతం:జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు

ఏపీలో ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ ఉంది అని జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ దార్శనికత ప్రశంసనీయమన్నారు. ‘సీఎం జగన్‌ విజన్‌ అద్భుతం. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎయిర్‌ కనెక్టివిటీ పెరుగుతుండటంతో ఏపీకి మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయం అని కొనియాడారు.

ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం: సియాంట్‌ చైర్మన్‌ బీవీ మోహన్‌ రెడ్డి

విశాఖలో తమ కంపెనీలను మరింత విస్తరిస్తాం అని సియాంట్‌ చైర్మన్‌ బీవీ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం అని కొనియాడారు. విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం. పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి జరుగుతోందని సియాంట్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోకవైపు భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ ప్రపంచానికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని.. వాటిని సమర్థవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed