డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తోన్న అభ్యర్థులు.. నామినేషన్ ఖర్చే కోటి దాటేస్తోందా?

by GSrikanth |
డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తోన్న అభ్యర్థులు.. నామినేషన్ ఖర్చే కోటి దాటేస్తోందా?
X

దిశ ప్రతినిది, విశాఖపట్నం: నామినేషన్ల పర్యంలో డబ్బు నీళ్ల ప్రాయంగా ఖర్చవుతోంది. మద్యం ఏరులై పారుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కనీసం పది వేల మందితో ర్యాలీ తీసి నామినేషన్ వేయాలని ఎక్కువ మంది అభ్యర్థులు భావిస్తుండడంతో నామినేషన్ ఖర్చే కోటి రూపాయలు దాటి పోతోంది. గురువారం నామినేషన్ల దాఖలు ప్రారంభంకాగా, శుక్రవారం ఊపందుకొంది. శుక్రవారం రాష్ర్ట వ్యాప్తంగా పలు నియోజక వర్గాలలో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

పోటీ పడుతున్న ప్రధాన పక్షాలు

ముఖ్యంగా ప్రధాన పక్షాలైన వైసీపీ, టీడీపీ అభ్యర్థులు నామినేషన్ల విషయంలో పోటా పోటీగా వ్యవహరిస్తున్నారు. వేల మందిని సమీకరిస్తున్నారు. ఇందుకోసం కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నారు. కార్లకు రూ.3 వేలు, ఆటోలకు రూ.800 నుంచి రూ.1500 వరకూ, ద్విచక్ర వాహనానికి రూ.500 నుంచి 800 వరకూ అభ్యర్థులకు ఇస్తున్నారు. ఇందులోని పెట్రోలు, డీజిల్ ఖర్చులు కలిసి వుంటాయి.

మనిషికి రూ.300 నుంచి వేయి వరకూ

అభ్యర్థులు పరిస్థితులకు అనుగుణంగా జనసమీకరణకు భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం నామినేషన్ కోసం వచ్చే జనానికి మనిషికి రూ.3‌00 నుంచి వేయి రూపాయల వరకూ చెల్లిస్తున్నారు. ఎండలు గట్టిగా వున్నందున అడుగడుగునా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో వుంచుతున్నారు. నామినేషన్ కార్యక్రమం పూర్తి అయి తిరిగి వెళ్లేప్పుడు బిరియానీ ప్యాకెట్ చేతుల్లో పెడుతున్నారు.

కోలాహలంగా నామినేషన్లు

తీన్మార్లు, తప్పెడ గుళ్లు, సాము గరిడీలు, కోలాటాలు, డీజేలు, కేరళ వాజ్యాలు ఇప్పుడు అభ్యర్థుల వెంట వుండాల్సిందే. ఇదేదో ఉత్సవాల మాదిరిగా కోలాహలంగా భాజాభజంత్రీలతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళుతున్నారు. బాణాసంచా తప్పనిసరి. ర్యాలీ ప్రారంభానికి ముందు గంటనుంచే వీటి హడావుడి ప్రారంభమవుతుంది.

టీషర్ట్‌లు, టోపీలు, హెయిర్ బ్యాండ్ లు పంపిణీ

అభ్యర్థి వెంట ర్యాలీలో పాల్గొనే వారికి టీ షర్ట్‌లు, టోపీలు, హెయిర్ బ్యాండ్‌లు ఉచితంగా పంచుతున్నారు. పార్టీ గుర్తు, రంగుతో పాటు అభ్యర్థి పేరుతో వీటిని ముద్రిస్తున్నారు. కొందరైతే ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో మహిళలను రప్పించి వారికి పార్టీ రంగు చీరలు పంపిణీ చేస్తున్నారు.

ఎన్నికల సంఘానికి కనిపించవు

అభ్యర్థులు ఇంత హడావుడి చేస్తున్నా, కోట్ల రూపాయలు నామినేషన్‌కే ఖర్చుచేస్తున్నా ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోవడం లేదు. నాలుగు ఆటోలు, నాలుగు కార్ల నెంబర్లు అభ్యర్థులు ఇవ్వడం, వాటినే అధికారులు నోట్ చేసుకొని వెళ్లిపోవడం సర్వసాధారణమైంది. ఐదు పది వేల మందితో ర్యాలీలు తీస్తుంటే, వందలాది కార్లు, ఆటోలు వారిని ఎక్కించుకొని వస్తుంటే అధికారులు మాత్రం కళ్లు మూసుకొని అభ్యర్థులకు సహకరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed