Breaking: అదుపు తప్పిన కారు.. హీరో ఇజం చూపిన కానిస్టేబుల్

by Indraja |   ( Updated:2024-02-19 09:24:47.0  )
Breaking: అదుపు తప్పిన కారు.. హీరో ఇజం చూపిన కానిస్టేబుల్
X

దిశ డైనమిక్ బ్యూరో: నిదానమే ప్రధానం. అతివేగం అత్యంత ప్రమాదకరం. ఈ విషయం తెలిసీ కొందరు అతివేగంతో వాహనాలను నడిపి అనర్ధాలను కొనితెచ్చుకుంటారు. ఇలా అతివేగంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా లోని రాజోలు గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కారులో రాజమహేంద్రవరం వెళ్లారు.

అక్కడ పనులన్నీ ముగించుకుని తిరిగి సొంత ఊరికి వస్తున్న నేపథ్యంలో కారు పి.గన్నవరం మండలం లోని బెల్లంపూడి గ్రామం వద్ద అదుపుతప్పి బైక్ ను ఢీ కొన్న కారు పక్కనే ఉన్న కాలువ లోకి దూసుకెళ్లింది. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నెల్లి శ్రీనివాస్ కారు కాలువలో ఉండడం చూసి హుటాహుటీన కాలువలోకి దిగి కార్ డోర్లు తీసి కారులో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు.

కాగా ప్రమాదానికి గురైన కారులో ఐదుగురు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏడుగురు ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఏడుగురుకి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక కొంత సమయానికి ఘటన స్థలానికి చేరుకున్న స్థానికుల సహాయంతో కారులో ఉన్న వారి వస్తువులను ఒడ్డుకు చేర్చారు.

అనంతరం స్థానికులు 108కి సమాచారం అందించారు. స్థానికుల సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికితరలించారు. ఇక నెల్లి శ్రీనివాస్ విషయానికి వస్తే ఈయన తూర్పుగోదావరి జిల్లా లోని ఎస్పీ ఆఫీస్‌లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆ ఏడుగురిని కాపాడిన కానిస్టేబుల్ పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story