ఏపీలో దయనీయంగా మారిన రైతన్న పరిస్థితి: మాజీమంత్రి దేవినేని ఉమా

by Seetharam |
ఏపీలో దయనీయంగా మారిన రైతన్న పరిస్థితి: మాజీమంత్రి దేవినేని ఉమా
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశానికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో కష్టపడే రైతుల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. తుపాను ప్రభావంతో పంటలు నీట మునిగి,గాలులకు నేలవాలి రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఉదారంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మైలవరం నియోజకవర్గంలోని కొత్తూరు తాడేపల్లిలో 2 వేల ఎకరాల వరకు పంట దెబ్బతిన్నదని చెప్పుకొచ్చారు. అధికార యంత్రాంగం దెబ్బతిన్న పంటలను, రైతుల వివరాలను త్వరితగతిన నమోదు చేసి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 30 నుండి 35 వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఇంజన్లతో నీరు పెట్టిన రైతులకు ఎకరానికి ఐదు నుంచి పదివేల రూపాయలు అదనపు ఖర్చు అయిందని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed