నేడే ఏపీ బడ్జెట్.. ఆ రెండు రంగాలకే ప్రాధాన్యం

by samatah |   ( Updated:2022-03-11 02:59:41.0  )
నేడే ఏపీ బడ్జెట్.. ఆ రెండు రంగాలకే ప్రాధాన్యం
X

దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీలో నేడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2,29,779.27 కోట్లతో సర్కారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో రెవెన్యూ వ్యయం 1,82,196.54 కోట్లు కాగా మూలధన వ్యయం 47,582.73 కోట్లు. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో.. లేకుంటే మరింత ఎక్కువగా బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై 2021-22లో పడిన ప్రభావం కాస్త తక్కువే. రాబడి బాగానే ఉండడంతో ఈసారి బడ్జెట్‌ను జనరంజకంగానే పెట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. కొంతకాలంగా ఈ విషయంపై ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన కసరత్తు చేస్తున్నారు. పలు శాఖలతో ఇప్పటికే అనేక సమీక్షలు నిర్వహించగా, దాదాపు మూడున్నర లక్షల కోట్ల వరకూ ఆయా శాఖలు ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలుస్తోంది. అనంతరం ఆ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి బుగ్గన అనేక సమీక్షలు నిర్వహించారు. వీటి అనుసారంగా ఏపీ బడ్జెట్‌ను రెడీ చేశారని తెలుస్తున్నది. ఈ సారి కూడా గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే 2 లక్షల 30 కోట్లకు అటూ ఇటుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే చాన్స్ ఉంది.

సింహభాగం సంక్షేమ పథకాలకే..

అధికారంలోనికి వచ్చిన నాటి నుంచీ సీఎం జగన్ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. దీనివల్ల ఆర్థిక శాఖపై పడే భారాన్నీ లెక్కచేయడం లేదు. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అధిక భాగం సంక్షేమ పథకాలకు కేటాయించే చాన్స్ ఉంది. అభివృద్ధి కార్యక్రమాలపైనా దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. అలాగే విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమలకూ గణనీయంగా కేటాయింపులు దక్కనున్నాయి.

అమరావతిపై దృష్టి పెడతారా?

ఇటీవల హైకోర్టు సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయడంతో పాటు మాస్టర్ ప్లాన్‌ను కూడా 6 నెలల్లో రెడీ చేయమని చెప్పింది. ఈ నేపథ్యంలో అమరావతి డెవలప్మెంట్ గురించిన ప్రస్తావన ఈ బడ్జెట్లో ఉంటుందా .. ఉంటే ఏ స్థాయిలో కేటాయింపులు చేస్తారు? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది.

రాష్ట్రానికి నిధులు కేటాయించని కేంద్రం

ఏటా మాదిరిగానే ఈ సారీ విభజన హామీల ప్రకారం దక్కాల్సినవేవీ సార్వత్రిక బడ్జెట్‌లో కేంద్రం కేటాయించలేదు. రైతులకు అందాల్సిన నిధుల్లో కోతలు కోశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే లేదు. విశాఖ రైల్వే జోన్‌కు నిధులు ఇవ్వలేదు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులూ రావడం లేదు. ఇలా రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ఏ నిధులూ కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావనకు రాలేదు. రాబడి, జీఎస్టీ రాష్ట్ర వాటా ఇవి మాత్రమే ఏపీకి ఆదాయవనరుగా మారింది. ఇప్పుడు బడ్జెట్‌ను కూడా వాటి ఆధారంగానే రెడీ చేయాల్సి వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

పోలవరం సంగతేంటి?

బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ తన ప్రసంగంలో 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ నేపథ్యంలో నిధులు కేటాయించేందుకు ఈ బడ్జెట్ కాకుండా మరొక బడ్జెట్‌కు మాత్రమే సమయముంది. మరి సర్కార్ ఆ దిశగా ఏవైనా కేటాయింపులు చేస్తుందా? అనే విషయమై ప్రతిపక్షాలతోపాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇటీవలే పోలవరం నిర్వాసితులకు కేంద్ర పరిహారం కొంత రావడం, దానికి అదనంగా ఏపీ నుంచి మరికొంత ఇస్తానని సీఎం జగన్ స్వయంగా చెప్పడం ఇవన్నీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇకపై యుద్ధ ప్రాతిపదికన నడుస్తుంది అని చెప్పడానికే అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరి దానికి కావాల్సిన ముఖ్యమైన కేటాయింపులు బడ్జెట్‌లో ఉంటాయా? అనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నది.

రెండు సభల్లోనూ ఏకకాలంలో..

- ఉదయం 10.15 గంటలకు బడ్జెట్

అసెంబ్లీలో ఉదయం 10 గంటల 15 నిముషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుండగా .. అదేసమయంలో శాసన మండలిలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. ఈ సందర్భంగా బుగ్గన ప్రసంగం గంటన్నర పైగానే ఉండే అవకాశం ఉంది.

Advertisement

Next Story