తెలంగాణకు ఉత్తమ అవార్డు... సీఎంను కలిసిన ఫిషరీస్ చైర్మన్, అధికారులు

by srinivas |   ( Updated:2024-11-22 16:59:09.0  )
తెలంగాణకు ఉత్తమ  అవార్డు... సీఎంను కలిసిన ఫిషరీస్ చైర్మన్, అధికారులు
X

దిశ; తెలంగాణ బ్యూరో: తెలంగాణకు ఉత్తమ మత్స్యకారుల (బెస్ట్ ఇన్ ల్యాండ్ ఫిషరీస్ స్టేట్ ఫర్ ది ఇయర్ 2024) అవార్డు లభించింది. 2024లో మత్స్యశాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, అభివృద్ధి దృష్టి కోణాన్ని గుర్తించి ఎంపిక చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కేంద్ర పశు సంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతులు మీదుగా మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, మత్స్యశాఖ డైరెక్టర్ ప్రియాంక ఆల లు ఈ వార్డును అందుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మత్స్యశాఖ అధికారులు, చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ..తెలంగాణ మత్స్యశాఖ దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 5,901 మత్స్య సహకార సంఘాలు 4,13,120 సభ్యులతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. డిసెంబర్ 2023 నుండి 225 కొత్త సంఘాలను ఏర్పాటు చేసి, 8,069 కొత్త సభ్యులను చేర్చడం ద్వారా సహకార సంఘాల విస్తరణను బలోపేతం చేశామన్నారు. బీమా పథకంలో 4.16 లక్షల మత్స్యకారుల జీవితాలను కాపాడటానికి రూ.139.77 లక్షల ప్రీమియం చెల్లించి ఆదర్శంగా నిలిచామన్నారు. కొత్త మత్స్య కుంటల నిర్మాణం కోసం రూ.2145.44 లక్షల వ్యయంతో 195.94 హెక్టార్లకు అనుమతులు మంజూరు చేశామన్నారు. మంచిర్యాల జిల్లా యెల్లంపల్లి జలాశయం వద్ద కొర్రమీను చేపల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ అక్వాకల్చర్ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.47.03 కోట్ల వ్యయంతో ఆధునిక మత్స్య మార్కెట్ నిర్మాణం జరుగుతోందని, "ఇందిరా మహిళ శక్తి" పథకంలో 32 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్లను 60 శాతం సబ్సిడీతో మహిళా సంఘాలకు అందచేయనున్నామని వివరించారు. ఈ ఏడాది 4.56 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తితో రూ.7059.04 కోట్ల ఆదాయాన్ని సాధించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్యరంగం కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ విజయాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో మత్స్యరంగంలో నూతన ఒరవడులను సృష్టించి అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed