అసెంబ్లీలో రౌడీల్లా, గూండాల్లా టీడీపీ సభ్యుల వ్యవహారం : మంత్రి ఆర్‌కే రోజా

by Seetharam |   ( Updated:2023-09-21 10:04:25.0  )
అసెంబ్లీలో రౌడీల్లా, గూండాల్లా టీడీపీ సభ్యుల వ్యవహారం : మంత్రి ఆర్‌కే రోజా
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీలో టీడీపీ శాసనసభ్యులు రౌడీలు, గూండాల్లా వ్యవహరించారు అని మంత్రి ఆర్‌కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌కి, ఆయన ఛైర్‌కు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నీచంగా ప్రవర్తించారు అని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన సమయంలో మంత్రి ఆర్‌కేరోజా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. పోడియం పైకి ఎక్కి, ఆయన చుట్టూ చేరి పేపర్లు చింపి మొఖాన విసిరారు. స్పీకర్‌ ఎదుటనున్న మానిటర్‌ను లాగేస్తూ వారి మంచినీళ్ల గ్లాసును ఎత్తి పడేసి పగులకొట్టారు. సభా సాంప్రదాయాన్ని పాటించకుండా అత్యంత జుగుప్సాకరంగా రచ్చ చేశారు అని రోజా మండిపడ్డారు. మీసాలు తిప్పడం, తొడలు కొట్టటానికి ఇది సినిమా అసెంబ్లీ కాదు అని మంత్రి రోజా బాలకృష్ణపై సెటైర్లు వేశారు. బావ కోసం అసెంబ్లీలో బాలకృష్ణ ఫీట్లు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆధారాలతో అడ్డంగా దొరికిన దొంగ బాబు

స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు ఏ తప్పూ చేయకపోతే.. సీఐడీ పోలీసులు నంద్యాల నుంచి మంగళగిరికి తెస్తున్నప్పుడు ఇప్పుడు మాట్లాడే టీడీపీ నేతలంతా అప్పుడు ఎక్కడికెళ్లారు..? ఆ రోజెందుకు రోడ్లమీదకొచ్చి గొడవలు చేయలేదు..? అని మంత్రి ఆర్ కే రోజా ప్రశ్నించారు. ఏసీబీ కోర్టులో దాదాపు 10 గంటలసేపు చంద్రబాబును ఉంచితే .. స్వయంగా న్యాయమూర్తి చంద్రబాబుకు మాట్లాడే అవకాశమిస్తే ఎందుకు తానేమీ తప్పు చేయలేదని చెప్పుకోలేదు..? అని నిలదీశారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ అసలు జరగలేదని.. ఈ స్కామ్‌లో తన ప్రమేమమేదీ లేదని.. తానేమీ డబ్బులు తినలేదని ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన పేరుమోసిన లాయర్లు కూడా ఈ స్కామ్‌లో చంద్రబాబు తప్పేమీలేదని చెప్పలేదని రోజా వెల్లడించారు. చంద్రబాబును అరెస్టు చేసేటప్పుడు గవర్నర్‌కి చెప్పలేదని.. 24 గంటల్లోపల కోర్టు ఎదుటకు తేలేదని కుంటిసాకులు చెప్పారే తప్ప.. స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయాన్ని గురించి వారు మాట్లాడలేదు అని రోజా అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో రూ.371 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసిన సంగతి న్యాయవాదులకు కూడా తెలుసునన్నారు. సీమెన్స్‌ సంస్థ ఒప్పందం పేరిట డిజైన్‌టెక్‌తో పాటు ఇతర షెల్‌కంపెనీలకు ప్రజాధనం రిలీజ్‌ చేసి హవాలామార్గంలో రూ.241 కోట్లు కొట్టేసిన దోపిడీదారుడు చంద్రబాబు నాయుడు అని మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు.

అరెస్టుపై చర్చిస్తామంటే టీడీపీ రివర్స్‌డ్రామా

స్కిల్‌స్కామ్‌లో అవినీతి చేసినట్లు అన్నీ ఆధారాలుండబట్టే చంద్రబాబు నాయుడు జైలుకెళ్లాడనేది అందరికీ తెలుసునని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. అధికార పార్టీ ఆ ఆధారాలను శాసనసభలో పెద్దపెద్ద స్క్రీన్‌లపై డిస్‌ప్లే చేసి మరీ చర్చ పెడుతుందనే భయంతో టీడీపీ నేతలు రివర్స్‌ డ్రామాకు తెరదీశారు అని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుపై చర్చకు పట్టుబట్టి గొడవ చేయాలనేది టీడీపీ ప్లాన్‌ అని విమర్శించారు. ఇది తెలిసి మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి చర్చకు సిద్ధమని ప్రకటించారని.. అడిగినంత సమయం టీడీపీ సభ్యులకిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినప్పటికీ ఏదోవిధంగా ఆ చర్చను సాగనీవ్వకుండా తామంతా శాసనసభ బయటకెళ్లాలనే దుర్బుద్ధితోనే టీడీపీ సభ్యులు ఈరోజు హంగామా సృష్టించారు అని మంత్రి ఆర్ కే రోజా చెప్పుకొచ్చారు.

రక్తికట్టని సింపతీడ్రామాలు

అవినీతి చేసి, అడ్డంగా దొరికి చంద్రబాబు జైలుకెళ్తే.. టీడీపీ సభ్యులేమో.. పాపం ముసలోడు..అన్నం సరిగా ఇవ్వలేదు. టాబ్లెట్లు ఇవ్వడంలేదు. దోమలు కుడుతున్నాయ్‌..వేడినీళ్లు ఇవ్వడంలేదంటూ సానుభూతి డ్రామాలాడుతున్నారు అని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజమండ్రి సెంట్రల్‌ జైలు అనేది చంద్రబాబు కట్టిందేనని వాళ్లే చెబుతున్నారు కదా..? అంటే, ఇన్నాళ్లూ అక్కడుంటే ఖైదీలకు ఏ సదుపాయాలు లేకపోయినా పర్లేదు..కానీ, వాళ్ల నాయకుడు చంద్రబాబుకు మాత్రం అన్నీ ఉండాలట. ఇదెక్కడి న్యాయం..? ఆయనేమైనా ఒలంపిక్స్‌ పోటీలకెళ్లి మెడల్‌ ఏమైనా సంపాదించుకొచ్చాడా..? ఒక ఫైవ్‌స్టార్, సెవెంత్‌స్టార్‌ హోటల్‌లో రూమ్‌ ఇవ్వడానికి..?’ అని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు వెధవ పనిచేసి జైలుకెళ్లాడని అలాంటి వ్యక్తికి ఇంకేమీ వసతులు ఇవ్వాలన్నారు. చంద్రబాబు వయసుకు గౌరవించి ఇంటినుంచి భోజనం, మందులు ఇప్పిస్తున్నారు. వేడ్నీళ్లు ఇస్తున్నారు. దోమలంటే.. ఒక దోమతెర ఇవ్వడం జరిగింది. స్నేహా బ్యారెక్‌ మొత్తం ఖాళీ చేయించి శుభ్రం చేయించి సీసీ కెమెరాలు, ఫుల్‌సెక్యూరిటీ భద్రతతో చంద్రబాబును చూసుకుంటున్నారని మంత్రి ఆర్‌కే రోజా చెప్పుకొచ్చారు. కేవలం పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతలు అసెంబ్లీలో ఓవరాక్షన్ చేశారని మంత్రి రోజా అన్నారు. టీడీపీ నేతలు ఎంత గింజుకున్నా వారికి మద్ధతిచ్చేందుకు మాత్రం ప్రజలు బయటకు రావడం లేదు అని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు.

Advertisement

Next Story