AP Elections 2024: వేడెక్కిన రాజకీయాలు.. అనపర్తిలో ఉద్రిక్తత

by Indraja |   ( Updated:2024-03-28 07:57:48.0  )
AP Elections 2024: వేడెక్కిన రాజకీయాలు.. అనపర్తిలో ఉద్రిక్తత
X

దిశ వెబ్ డెస్క్: టీడీపీలో పొత్తు చిచ్చు తారాస్థాయికి చేరింది. నిన్న టీడీపీ అధిష్టానం అనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ నేతను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్ ను నిరాకరించింది. దీనితో తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ఇంటికి భారీగా టీడీపీ కార్యకర్తలు క్యూ కట్టారు.

టీడీపీ కరపత్రాలను, ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు తగలబెడుతున్నారు. సైకిల్ ను మంటల్లో వేసి దగ్ధం చేశారు. నల్లమిల్లికి టికెట్ ఇవ్వలేదని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు టీడీపీ కార్యకర్తలు నల్లమిల్లి ఇంటిపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన మిగితా కార్యకర్తలు అప్రమత్తమై వాళ్ళను కిందకు దించారు.

ఇక నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోతే రాజీనామా ఇచ్చేందుకు కూడా సిద్ధం అని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. నల్లమిల్లికి పార్టీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తల్లి సత్యవతి జీర్ణించుకోలేక పోయారు. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన తన కొడుకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డికి టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఆమె మనోవేదనకు గురైయ్యారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లిని పట్టుకుని ఆమె కన్నీటి పర్యంతమైయ్యారు. ఇక మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసారు. సంయమనంతో ఉండాలని కార్యకర్తలను కోరారు. తాను అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇక ఏదేమైనా తాను వెనక్కి తగనని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story