నగరంపాలెం పీఎస్ వద్ద ఉద్రిక్తత: టీడీపీ నేతల అరెస్ట్

by Seetharam |
నగరంపాలెం పీఎస్ వద్ద ఉద్రిక్తత: టీడీపీ నేతల అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించిన నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు నగరం పాలెం పీఎస్ వద్దకు టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, వేములపల్లి బుజ్లు సైతం బండారు సత్యనారాయణ మూర్తిని కలిసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో వారిని స్టేషన్ బయటే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి వ్యాన్‌లో తరలించారు. అలాగే నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి టీడీపీ శ్రేణులను రానియ్యకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదిలా ఉంటే మాజీమంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ నేపథ్యంలో నక్కా ఆనందబాబు పోలీస్ స్టేషన్‌కు వస్తారనే సమాచారంతో గృహనిర్బంధం చేశారు. ఆనందబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు గుంటూరులోని టీడీపీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

Next Story