టీచర్ టార్చర్: కొడుతున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

by Seetharam |   ( Updated:2023-11-07 06:34:43.0  )
టీచర్ టార్చర్: కొడుతున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : అందర్నీ కంటికి రెప్పలా కాపాడాల్సిన టీచర్ దారి తప్పాడు. కొంతమంది పిల్లలను టార్గెట్ చేసి చావబాదుతున్నాడు. అంతేకాదు విద్యార్థులకు హాస్టల్‌లో సరిగ్గా ఫుడ్ పెట్టనీయకపోవడం, మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడం వంటి దుర్మార్గాలకు ఒడిగట్టాడు. టార్గెట్ చేసిన విద్యార్థులను రోజుకో కొత్త విధానంలో వేధింపులకు గురి చేస్తుండటంతో వారు తట్టుకోలేకపోయారు. హెడ్‌మాస్టర్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినా ఆ టీచర్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో వారంతా కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పిఈటీ టీచర్ తమను ఇష్టానుసారం విచక్షణారహితంగా కొడుతున్నారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న తరుణంలో విద్యార్థుల తరఫున పలువురు టీచర్లు సైతం సదరు టీచర్‌పై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

చర్యలకు ఆదేశం

చిలకలూరిపేట మండలం రాజాపేట గురుకుల పాఠశాలలో బండ్ల అశోక్ పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పీఈటీ బండ్ల అశోక్ తమను టార్గెట్ చేసిమరీ విచక్షణారహితంగా కొడుతున్నాడంటూ పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పీఈటీ వేధింపులు రోజు రోజుకు తీవ్రమవుతుండటంతో తాము తట్టుకోలేకపోయామని విద్యార్థులు వాపోయారు. హెడ్ మాస్టర్‌కు ఫిర్యాదు చేసినా.. ఎంఈవోకు ఫిర్యాదు చేసినా... ఆఖరికి ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా సదరు టీచర్ ప్రవర్తనలో మార్పు రావడం లేదని విద్యార్థులు వాపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఏకంగా జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌కు ఫిర్యాదు చేశారు. టీచర్ బండ్ల అశోక్‌ వేధింపులపై ఏకరువు పెట్టుకున్నారు. పీఈటీ 50 మంది విద్యార్థులను టార్గెట్ చేసి హింసిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తమను రోజూ చితక బాదుతున్నారని ఆ దెబ్బలను తాము తట్టుకోలేకపోతున్నట్లు కలెక్టర్ వద్ద చెప్పుకుంటూ విలపించారు. అంతేకాదు పీఈటీ దాడి చేసిన గాయాలను కలెక్టర్‌కు చూపించారు. పీఈటీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సందర్భంలో హాస్టల్‌లో సమస్యలను కలెక్టర్ ఎదుట మెురపెట్టుకున్నారు. రెండు రోజులుగా తమకు ఆహారం సరిగ్గా అందడం లేదని..కనీసం తాగేందుకు నీళ్లు కూడా దొరకడం లేదని వాపోయారు. దీంతో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి తిని అవి అయిపోయాక పస్తులుంటున్నట్లు విలపించారు. విద్యార్థుల సమస్యలు విని కలెక్టర్ శివశంకర్ చలించిపోయారు. పీఈటీపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు మద్దతుగా ఉపాధ్యాయులు

స్కూల్ హెడ్ మాస్టర్ ఉషారాణి, ఎంఈవో లక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాసరావులు విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ను కలిశారు. పీఈటీపై వారు సైతం ఫిర్యాదు చేశారు. విద్యార్థులను చావబాదుతున్నారని కలెక్టర్‌దృష్టికి తీసుకెళ్లారు. తాము చెప్తున్నా పీఈటీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇలా రావాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed