టీడీపీ కొత్త అస్త్రం: ప్రజల్లోకి వెళ్లేందుకు సరికొత్త వ్యూహం

by Seetharam |
టీడీపీ కొత్త అస్త్రం: ప్రజల్లోకి వెళ్లేందుకు సరికొత్త వ్యూహం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్టై జైల్లో ఉన్న తర్వాత టీడీపీ ప్రజల్లోకి వెళ్లలేదు. బాబుతో నేను అనే కార్యక్రమం మినహా ప్రజల్లోకి వెళ్లిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ సైతం చంద్రబాబును జైలు నుంచి బయటకు విడిపించే దానిపై ఫోకస్ పెట్టింది. చంద్రబాబు అరెస్ట్‌పైనే నిరసనలు చేపడుతుంది. ఇప్పటికే ఇతర పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయినా టీడీపీ మాత్రం ఇంకా ప్రజల్లోకి వెళ్లలేనటువంటి పరిస్థితి. అయితే ఏ అంశంతో ప్రజల్లోకి వెళ్లాలి అనే దానిపై టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఈనెల 25 నుంచి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రైతుల పక్షాన ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ యోచిస్తోంది. అన్నదాతలు కష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఆ కష్టాల్లో నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని లోకేశ్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

రైతుల సమస్యలపై చర్చ

తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రైతుల తరఫున ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలపై తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ సీజన్ లో వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని, అయితే సాగు చేసిన పంటలు కూడా వర్షభావం కారణంగా నేడు నీరందక ఎండిపోతున్నాయని టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సాగునీటి కష్టాలపై టీడీపీ విస్తృస్థాయి సమావేశంతోపాటు ఆదివారం జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. రైతులతో కలిసి పోరాటం సాగించాలని టీడీపీ స్ట్రాటజీ కమిటీ నిర్ణయించింది.

ప్రభుత్వంపై ఒత్తితడి తెచ్చే యోచన

మరోవైపు రాష్ట్రంలో జిల్లాల వారీగా పంటలు దెబ్బతిన్న పరిస్థితి, రైతుల దీన స్థితిని నేతలు లోకేశ్‌కు స్ట్రాటజీ కమిటీ సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని నేతలు తెలిపారు. కొన్ని జిల్లాల్లో 70 నుంచి 80 శాతం వర్షపాతం లోటు ఉందని లోకేశ్ వద్ద ప్రస్తావించారు. నెల రోజులుగా చినుకు లేకపోవడం.. ఎండలు మండుతుండడంతో సాగు చేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయని నేతలు ఆరోపించారు. సాగునీటి కష్టాలపై టీడీపీ విస్తృత స్థాయి, స్ట్రాటజీ సమావేశాల్లో నేతలు చర్చించారు. ఈ సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖలు పూర్తిగా మూసివేశారంటూ మండిపడ్డారు. కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు కనీస స్థాయిలో కూడా ప్రభుత్వం స్పందించడం లేదని ఈ సందర్భంగా లోకేశ్ అభిప్రాయపడ్డారు. సబ్సిడీల నిలిపివేత, పెరిగిన సాగు ఖర్చులతో సతమతం అవుతున్న అన్నదాతలపై కరువు పరిస్థితుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తల క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు. రైతుల సమస్యలపై చర్చించాలన్నారు. అన్నదాతల కష్టాలపై ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని పార్టీ యంత్రాంగాన్ని లోకేశ్ ఆదేశించారు. రైతన్నల కష్టాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. రైతులు ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story