AP News:ఏసీఏ కార్యవర్గం ఏకగ్రీవం..అధ్యక్షుడిగా టీడీపీ ఎంపీ

by Jakkula Mamatha |
AP News:ఏసీఏ కార్యవర్గం ఏకగ్రీవం..అధ్యక్షుడిగా టీడీపీ ఎంపీ
X

దిశ, ఏపీ బ్యూరో:అధికార టీడీపీ పార్టీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్ఠాత్మక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో జరిగిన ది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం ఎన్నికలు జరగాలి. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారి ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏడాది పాటు ఈ హోదాలో కొనసాగుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇది వరకు ఉన్న పాత కమిటీ రాజీనామా చేసింది. దీంతో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఆగస్టు 16వ తేదీన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆరు పోస్టులకు ఆరుగురు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ (చిన్ని) (కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్), ఉపాధ్యక్షుడిగా పి.వెంకట రామ ప్రశాంత్ (యునైటెడ్ క్రికెట్ క్లబ్), కార్యదర్శిగా కాకినాడ టీడీపీ నేత సానా సతీష్ బాబు (ది విశాఖపట్నం క్రికెట్ క్లబ్), సంయుక్త కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీకి చెందిన విశాఖపట్నం నార్త్ శాసనసభ్యుడు పి.విష్ణుకుమార్ రాజు (విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్), కోశాధికారిగా డీ.శ్రీనివాస్‌ (ది కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్), కౌన్సిలర్ గా డి.గౌర్ విష్ణు తేజ్ (విజయనగరం క్రికెట్ క్లబ్)నుంచి ఆయా పదవుల కోసం వారు దాఖలు చేసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పరిగణనలోకి తీసుకున్నారు. ఆగస్టు 17న నామినేషన్స్ పరిశీలన నిర్వహించారు. ఆగస్టు 19వ తేదీతో నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగిసింది. 20వ తేదీ పోటీదారుల తుది జాబితా ప్రకటించారు. ఆదివారం జరిగిన సమావేశంలో కార్యవర్గం ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు.

Advertisement

Next Story