‘ఫుడ్ పాయిజన్‌’ సమస్యకు చెక్ పెట్టేలా సర్కార్ ప్లాన్.. స్టూడెంట్స్, టీచర్లతో కమిటీ..!

by Shiva |
‘ఫుడ్ పాయిజన్‌’ సమస్యకు చెక్ పెట్టేలా సర్కార్ ప్లాన్.. స్టూడెంట్స్, టీచర్లతో కమిటీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ నిత్యకృత్యంగా మారింది. మొన్నటికి మొన్న మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ బాలిక ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందడంతో సర్కార్‌కు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో ఫుడ్ పాయిజన్ ఇష్యూను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఫుడ్ పాయిజన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఫుడ్ క్వాలిటీపై దృష్టిసారించాలని చూస్తోంది. ఫుడ్ పాయిజన్ జరగకుండా వంటకు ముందు, వంటకు తర్వాత చెక్ చేశాకే విద్యార్థులకు భోజనం అందించాలని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి గానూ ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునున్నట్లు తెలుస్తోంది. అయితే, అందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ మరో రెండు రోజుల్లో రానున్నట్లు చెబుతున్నారు.ః

ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలు..

ఫుడ్ పాయిజన్ అంశంలో క్వాలిటీకి పెద్ద పీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిడ్ డే మిల్స్ లో క్వాలిటీ పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా పరిస్థితి మారడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ అంశంపై విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ ఘాటు విమర్శలు చేస్తున్నాయి. గులాబీ పార్టీ గురుకుల బాట పేరిట ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7 వరకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 11 నెలల్లో 38 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగ్గా.. 48 మంది విద్యార్థులు మృతి చెందడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీని ఏర్పాటు చేయనుంది. ఆ నివేదికను పార్టీకి అందజేయనుంది. ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇకపోతే కమల దళం ఈ ఇష్యూపై ఎలాంటి ఆందోళనలు చేపట్టకపోయినా విమర్శలు చేస్తూనే ఉంది. దీంతో ఆలస్యంగానైనా ప్రభుత్వం మేల్కొని చర్యలు చేపట్టాలని చూస్తోంది.

ఫుడ్ చెక్ చేసేందుకు కమిటీ

తెలంగాణలో గురుకులాలు, సర్కార్ పాఠశాలలు, హాస్టళ్లు.. ఇలా ప్రభుత్వం భోజనం అందించే అన్నిచోట్ల మానిటరింగ్ చేపట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. త్వరలో పాఠశాల స్థాయిలో స్టూడెంట్స్, టీచర్స్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. విద్యార్థులకు భోజనానికి ముందే శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవడంపై ఈ కమిటీ కృషి చేయనుంది. రెగ్యులర్ గా ఫుడ్ చెకప్ చేసేలా పర్యవేక్షణకు చర్యలు తీసుకోనుంది. స్కూల్ లెవెల్లో టీచర్లు, స్టూడెంట్లతో వేర్వేరుగా ఫుడ్ను పరిశీలించాకే విద్యార్థులకు అందించాలని చూస్తున్నారు. కాగా జిల్లా స్థాయిలో మిడ్ డే మిల్స్ పై రెగ్యులర్ గా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు మానిటరింగ్ చేయనున్నాయి. దాదాపు 13 ఏండ్ల తర్వాత జీవో నంబర్ 21లో పలు మార్పులు చేపట్టాలని సర్కార్ భావిస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు అందించిన మిడ్ డే మీల్స్ పర్యవేక్షణకు నాలుగు స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేశారు. స్టేట్ లెవల్ కమిటీతో పాటు స్టేట్ లెవల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవల్, మండల్ లెవల్ కమిటీలు ఇందులో ఉన్నాయి. 2011లో దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీచేశారు. కాగా దాదాపు 13 ఏండ్ల తర్వాత జీవో నంబర్ 21లో పలు మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. మరోసారి ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా సర్కార్, విద్యాశాఖ ప్లాన్ చేస్తోంది.

మిడ్ డే మీల్స్ ధరల పెంపు

పీఎం పోషణ్ పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే మిడ్ డే మీల్స్ ధరలను కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ స్కూళ్లలో ఒక్కో విద్యార్థికి రూ.6.19 అందించనుంది. గతంలో ఈ రేటు రూ.5.45 గా ఉండగా తాజాగా రూ.6.19కి పెంచింది. అలాగే అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.9.29 అందించనుంది. గతంలో ఇది రూ.8.17 ఉంది. ఈ ధరలు డిసెంబర్ 1 నుంచి అమలు కానున్నాయి. అయితే మార్కెట్లో ధరల పెరుగుదలను అనుసరించి మరికొంత పెంచాల్సిన అవసరముందని పలువురు దీనిపై విమర్శలు చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed