తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతల అరెస్ట్

by Prasanna |
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతల అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతల అరెస్ట్‌లు మళ్లీ మెుదలయ్యాయా? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీలో యాక్టివ్‌గా ఉండే నాయకులను వైసీపీ టార్గెట్ చేసిందా? వాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు సీఐడీని అస్త్రంగా ఉపయోగిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో సీఐడీ రంగంలోకి దిగి పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు బయటకు రావాలంటేనే భయపడిపోయారు. అయితే గత కొన్ని రోజులుగా టీడీపీ దూకుడు పెంచింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టిపోటీ ఇస్తుందని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇలాంటి తరుణంలో తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. చిట్స్ కంపెనీల నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ సీఐడీ అరెస్ట్ చేసింది. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీఐడీ అరెస్ట్ చేయడంపై రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇకపోతే వచ్చే నెలలో రాజమహేంద్రవరంలోని వేమగిరి వద్ద టీడీపీ మహానాడును నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు వేదికను సైతం సిద్ధం చేసింది. టీడీపీ నేతలతో కలిసి ఆదిరెడ్డి అప్పారావు, వాసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మహానాడుకు అన్నీ తామై వ్యవహరించాలని భావిస్తున్న తరుణంలో సీఐడీ ఇలా అరెస్టులు చేయడం సంచలనంగా మారింది.

చిట్స్ ఫండ్ వ్యాపారాలపై ఆరా

తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్సీ, ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆదివారం తెల్లవారు జామున వారి నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఇకవివరాల్లోకి వెళ్తే గత కొన్నేళ్లుగా జగజ్జనని , జగదీశ్వరి పేర్లతో చిట్స్ ఫండ్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో తేడాలు ఉన్నాయంటూ సీఐడీ కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఐడీ ఆదివారం ఉదయం 5 గంటలకు ఆదిరెడ్డి అప్పారావు నివాసానికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని సీఐడీ కార్యాలయానికి తరలించారు. రాజమండ్రి సీఐడీ కార్యాలయంలో చిట్ ఫండ్ కంపెనీల లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. ఆదిరెడ్డి అప్పారావు అరెస్ట్ నేపథ్యంలో సీఐడీ కార్యాలయానికి ఆయన అనుచరులు భారీగా తరలివచ్చారు. అయితే కార్యాలయం దగ్గర గేట్లు వేసి ఎవరినీ లోపలికి రానీయకుండా సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీంతో సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దూకుడుకు కళ్లెం వేసేందుకేనా?

ఇకపోతే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసులు తొలుత వైసీపీలో కొనసాగేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కూడా ఆదిరెడ్డి అప్పారావు ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి టీడీపీలో చేరారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఆదిరెడ్డి అప్పారావు కోడలు, ఆదిరెడ్డి వాసు సతీమణి ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ తరఫున అటు అసెంబ్లీలోనూ ఇటు నియోజకవర్గంలోనూ ఆదిరెడ్డి భవానీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.అటు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆదిరెడ్డి వాసు సైతం స్పీడందుకున్నారు. టీడీపీ గెలుపుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.

మహానాడు వేళ అరెస్టులు కలకలం

ఇకపోతే మే 27, 28 తేదీల్లో రాజమండ్రి వేమగిరిలో టీటీడీ మహానాడును నిర్వహించానున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ మహానాడులో 27న 15 వేల మందితో ప్రతినిధుల సభ, 28న భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈసారి మహానాడుకు 2 చోట్ల వేదికలు ఏర్పాటు చేశారు. మహానాడు నిర్వాహణ కోసం 15 కమిటీలు నియమించే పనిలో టీడీపీ నిమగ్నమైంది. మే 28న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు.. 15 లక్షల మంది హాజరవుతారని పార్టీ భావిస్తోంది. ఇటీవల పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా వరస విజయాలు సాధించి, మంచి జోష్‌ మీద ఉన్న టీడీపీ.. మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు రాజకీయ కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవరంలో సభ అంటే టీడీపీకి శుభమేననే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. మహానాడుకు సుమారు 100 ఎకరాల స్థలం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మహానాడుకు సంబంధించి అన్నీ తామై వ్యవహరించేందుకు అటు ఆదిరెడ్డి ఫ్యామిలీ సన్నద్దమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్పలతోపాటు పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు సభాస్థలాన్ని పరిశీలించారు. ఇలా మహానాడుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఆదిరెడ్డి అప్పారావు,వాసులు అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.

రిమాండ్‌కు తరలించే ఛాన్స్

ఇకపోతే గత నెలలో సీఐడీ అధికారులు జగజ్జనని, జగదీశ్వరి చిట్ ఫండ్స్ కార్యాలయాలపై సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ సోదాలలో అధికారులకు చిట్ ఫండ్స్ కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు తప్పుడు సమాచారం ఇచ్చారని సీఐడీ ఆరోపిస్తోంది. చిట్ ఫండ్ లావాదేవీల్లోల అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించింది.అంతేకాదు వినియోగదారులకు చెల్లింపుల వ్యవహారంలో అవకతవకలు పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. 420, 409, 120బీ, 477ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను సీఐడీ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆదిరెడ్డి వాసు సతీమణి ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. ఆదిరెడ్డి భవానీ టీడీపీ కీలక నేత దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె. ప్రస్తుతం ఆదిరెడ్డి భవానీ సోదరుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగానూ..బాబాయ్ అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed