టార్గెట్ వైసీపీ ! అలక నేతలపై టీడీపీ, జనసేన ఫోకస్

by Javid Pasha |   ( Updated:2023-11-01 02:51:02.0  )
టార్గెట్ వైసీపీ ! అలక నేతలపై టీడీపీ, జనసేన ఫోకస్
X

టీడీపీ-జనసేన పొత్తు నేపథ్యంలో ‘టార్గెట్ వైసీపీ’ పేరుతో ఇరు పార్టీల నేతలు ముందుకెళ్తున్నారా ? అందు కోసమే రాష్ర్ట వ్యాప్తంగా టీడీపీ-జనసేన పార్టీల రాష్ర్ట నాయకులు రంగంలోకి దిగారా ? ప్రతి జిల్లాలో సమన్వయ కమిటీ సమావేశాలతో నేతలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లా బాస్ లు కూడా నియోజకవర్గాల ఇన్చార్జిలతో మమేకమవుతూ ప్రత్యేక దృష్టి సారించే పనిలో నిమగ్నమయ్యారు. వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడుతోన్న నియోజకవర్గాలు, అలక నేతలపై రాష్ర్ట పరిశీలకులు, నాయకులు ఫోకస్ పెట్టారు.

దిశ, కర్నూలు ప్రతినిధి: ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ముందుకు వెళుతున్నాయి. ఇందులో భాగంగా ఇక్కడ అలకలు, విభేదాలను సద్దుమణిగేలా చేసేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు బీటీ నాయుడు, మల్లెల రాజశేఖర్ గౌడ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు సెగ్మెంట్ కు టీజీ భరత్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. ఈయనతోపాటు మరో ఇద్దరు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో 2019లో మాజీ పంచాయతీ రాజ్ చీఫ్ సెక్రటరీ, చంద్రబాబు నాయుడు సలహాదారు అయిన రామాంజనేయులు పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి నేటి వరకు ఈయన నియోజకవర్గంలో కనిపించ లేదు. ఆ తర్వాత నియోజకవర్గ బాధ్యతలు ఆకెపోగు ప్రభాకర్ చూస్తున్నారు. ఈ సారి ఈ నియోజకవర్గంలో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ నియోజకవర్గ ఇంచార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిలు తమతమ వర్గీయులకు సీటు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీవీ జయనాగేశ్వర రెడ్డి అభ్యర్థిగా ఉండగా కోట్ల వర్గానికి చెందిన గోనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణయ్య సీటు ఆశిస్తున్నారు. మంత్రాలయంలో తిక్కారెడ్డి ఉన్నారు. కౌతాళం మండలానికి చెందిన ఉలిగయ్య, కోసిగికి చెందిన పల్లెపాడు ముత్తురెడ్డి, గోతులయ్య, భాస్కర్ రెడ్డిలు ప్రతిసారి మంత్రాలయం టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. ఈ సారైన టికెట్ తమకే ఇవ్వాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్లు సమాచారం.

జనసేన కూడా ఆశాభావం

ఆలూరు నియోజకవర్గ ఇంచార్జిగా కోట్ల సుజాతమ్మ ఉన్నారు. అయితే జనసేన ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆశిస్తోంది. దీంతో ఇక్కడ జనసేన నుంచి తెర్నేకల్ వెంకప్ప సీటు ఆశించే వారిలో ఉన్నారు. ఆలూరు టికెట్ రేసులో వైకుంఠ మల్లికార్జున, వీరభద్ర గౌడ్ పోటీ పడుతున్నారు. ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మల మధ్య వార్ నడుస్తోంది. టీడీపీకి చెందిన భాస్కర్ రెడ్డి, కురువ మాన్వి దేవేంద్రప్ప, సౌదీ రావూఫ్, ఫక్రుద్దీన్, రామస్వామి వంటి వారు సీటు సం ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరంతా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి దూరంగా ఉంటున్నారు. ఒకవేళ వీరికి అధిష్టానం సీటు కేటాయించకుంటే గుడిసె కృష్ణమ్మకు కేటాయించాలని ప్రతిపాదించనున్నట్లు సమాచారం. పత్తికొండలో కేఈ శ్యాంబాబు అభ్యర్థిగా ఉండగా బత్తిన వెంకట్రాముడు సీటు ఆశిస్తున్నారు.

నంద్యాల పార్లమెంట్ పరిధిలో..

నంద్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి తదితర నాయకులు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. భూమా అఖిల ప్రియ నంద్యాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతో తన సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి జనసే నేత మైలేరి మల్లయ్య సీటు ఆశిస్తున్నారు. బనగానపల్లె నియోజక వర్గంలో బీసీ జనార్ధన్ రెడ్డికి సీటు ఖాయమైంది. పాణ్యంలో గౌరు చరితకు సీటు ఇస్తారా ? మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డికి సీటు ఇస్తారా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. నందికొట్కూరు నియోజకవర్గంలో జయసూర్య అభ్యర్థిగా ఉన్నారు. ఈయనతోపాటు మరికొందరు నేతలు బరిలో ఉన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇంచార్జిగా కొనసాగుతున్నా.. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి సీటు ఆశిస్తున్నారు. డోన్ నియోజకవర్గంలో ధర్మారం సుబ్బారెడ్డి ఇంచార్జిగా ఉన్నారు. ఇక్కడ ధర్మారం సుబ్బారెడ్డి, కేఈ కుటుంబానికి వైరం నడుస్తోంది. ఈ సారి కేఈ కుటుంబంతో పాటు కోట్ల కుటుంబీకులు కూడా సీటు ఆశించే వారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విభేదాలు వీడి కలిసికట్టుగా పని చేసి విజయాలను చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని పార్టీ పెద్దలు దిశా నిర్దేశం చేస్తున్నారు.

Advertisement

Next Story