AP: ప్రచారం ఫుల్లు.. పనులు నిల్లు.. సంబరాల్లో నేతలు..సంశయంలో ప్రజలు

by Indraja |
AP: ప్రచారం ఫుల్లు.. పనులు నిల్లు.. సంబరాల్లో నేతలు..సంశయంలో ప్రజలు
X

దిశ డైనమిక్ బ్యూరో: పావలా కోడికి.. ముప్పావలా మసాలా అనే సామెత నర్సీపట్నం నియోజకవర్గ అధికార పార్టీ నేతలకు అతికినట్టు సరిపోతుందని అంటున్నారు ప్రజలు. ప్రజా సంక్షేమమే ధ్యేయం అని ప్రగల్భాలు పలికే ప్రభుత్వం అభివృద్ది విషయంలో మాత్రం చేతులెత్తేసింది అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ సమస్యలపై ఎప్పుడు స్పందిస్తుందా అని కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు ప్రజలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇది ఇలా ఉంటె ఏ చిన్న పనికి ఆమోదం వచ్చిన చాలు ఆ పార్టీ నాయకుల ఆనందానికి హద్దూ, అదుపూ లేకుండా పోతోంది. అయితే ఆనందాన్ని ఎవరు కోరుకోరు అనుకున్నారేమో గాని వాళ్ళ సంతోషాన్ని కార్యకర్తలు, ప్రజానీకానికి ఆహ్వానాలు పంపిమరీ పంచుతున్నారు. ఇక పనులు పూర్తవుతున్నాయా? అంటే అదీ లేదు. స్థానికంగా ఉన్న సమస్యల్లో ఎదో ఒక సమస్య పరిష్కారానికి వైసీపీ అధిష్టానం ఆమోదం తెలపడం.. ఆమోదించిన పని పూర్తికాక ముందే మరో పనికి పూనుకోవడం ఇదే తంతు జరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి ఆమోదం వస్తే చాలు వేడుకలు.. ఆ పనులు పూర్తి కాకపోయినా, సగంలో ఆగిపోయిన సరే వైసీపీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. పేలని బాంబుకు ఒత్తి పొడుగు అన్నట్లు స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించక పోయిన, పనులు పూర్తి చేయకపోయినా.. ఇంటింటికి తిరిగి స్వీట్లు పంచి పెడుతూ ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు. ఇక స్థానిక సమస్యలపై అక్కడి నాయకులు అధిష్టానానికి మొరపెట్టుకుంటే వాళ్ళ ప్రతిపాదనల పై రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేల స్పందించని నేపథ్యంలో ఏదైనా ప్రాధాన్యత ఉన్న పని మంజూరైందంటే ఇక స్థానిక నాయకుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు.

గతంలో నర్సీపట్నం నుంచి కేడీపేట వెళ్లే మార్గం గొలుగొండ మండల పరిధిలో ఉన్న రహదారిలో అటవీశాఖకు చెందిన భూమిలో ఉన్న రోడ్డును వెడల్పు చేసి, కల్వర్టులతో కొత్తగా నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం రూ. 6 కోట్ల నిధులను మంజూరు చేసి.. రోడ్డు పనులను ఆర్ అండ్ బీకి కేటాయించింది. ఇక గత ఏడాది రోడ్డు పనులు ప్రారంభించే సమయంలో ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో సంక్రాంతిని తలపించే పెద్ద పండగనే చేశారు.

మండలం లోని అన్ని గ్రామాల్లో రోజుల తరబడి స్వీట్లు పంచుతూనే ఉన్నారు. ఏళ్ల తరబడి మండల ప్రజల ఇబ్బందులకు రెండు, మూడు నెలల్లో పరిష్కారం లభిస్తుందని అందరికీ గొప్పగా చెప్పారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు కేవలం రోడ్డు నిర్మాణంలో భాగంగా ఉన్న కాల్వగట్టు పనులు పూర్తి చేసి, రోడ్డు విస్తరణ పనులను మధ్యలోనే వదిలేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిపివేసినట్టు కాంట్రాక్టరు తెలిపారు.

ఇక రెండు మూడు నెలల్లో పూర్తి అవుతుందని చెప్పిన రోడ్డు ఏడాది గడిచిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. అలానే ఏడాది క్రితం ఆగిపోయిన రోడ్డు నిర్మాణం పై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని.. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి గుడి నుంచి పెదబొడ్డేపల్లి వరకు 40 అడుగుల రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు కాగా చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయని ప్రజలు తెలిపారు.

చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయిన.. తాము చేసిన మంచిపనులు అంటూ నాయకులు చాటింపు వేసి, అలానే శుభలేఖలు ముద్రించి, మేం చేసిన పని చూడండంటూ ఇంటింటికి వెళ్లి ఆహ్వానాలు ఇచ్చి మరి ప్రచారం చేస్తున్నారని.. పనులు మంజూరైనా.. సగం చేసినా.. పండగలేనా.. అని ప్రతిపక్ష నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. ప్రజలసమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.

Advertisement

Next Story

Most Viewed