పల్లె ఉపపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

by samatah |
పల్లె ఉపపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్
X

పల్లె ఉప పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సార్వత్రిక పోరుకు కొద్ది నెలల ముందుగా నిర్వహించనున్న ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల ద్వారా పల్లె నాడి తెలుసుకునేందుకు ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ ఇది.. రానున్న సార్వత్రిక పోరును ఎంతగానో ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. మరో వైపు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి, ఈ నెల 19వ తేదీన పోలింగ్ నిర్వహణకు ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది.

దిశ, కర్నూలు ప్రతినిధి : ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 40 మండలాల్లో 4 సర్పంచులు, 333 వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నిలకు కేవలం 9 నెలల సమయం మాత్రమే గడువు ఉంది. ఈ క్రమంలో గ్రామల్లో ఉప పోరుకు రాష్ర్ట ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఉత్కంఠతకు దారి తీసింది. సాధారణంగా ఈ ఎన్నికల్లో అకాల మరణం చెందిన వారి కుటుంబీకులకే కట్టబెట్టే సంప్రదాయం ఉంది. కానీ ఈ సారి అలా కాకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. టీడీపీ యువ నాయకులు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర, చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్టుల పరిశీలన కోసం యుద్ధభేరి కార్యక్రమంతో రాజకీయ వేడి మొదలైంది.

ప్రభుత్వంపై వ్యతిరేకత పని చేస్తుందా ?

రాష్ర్ట ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, 14వ, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.350 నుంచి రూ.400ల కోట్ల వరకు నిధులు దారి మళ్లించడం పట్ల సర్పంచులు ఆగ్రహంగా ఉన్నారు. తమ నిధులు తమకే ఇవ్వాలంటూ ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా సర్పంచులు వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. ఇది ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందో ? లేదో ? వేచి చూడాలి.

ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలు

కర్నూలు జిల్లాలో 16 మండలాల్లో 42 గ్రామ పంచాయతీల్లో ఒక సర్పంచ్, 42 వార్డులకు, కౌతాళం మండలం బదినేహాలు గ్రామంలో సర్పంచ్ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. నంద్యాల జిల్లాలో 24 మండలాల్లో 32 గ్రామ పంచాయతీల్లో మూడు సర్పంచ్ స్థానాలు, 32 గ్రామ వార్డుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు, కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె, అవుకు మండలం అన్నవరం గ్రామాల్లో సర్పంచుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించునున్నారు. ప్రస్తుతం ప్రతి వార్డులో సగటున 150 మంది నుంచి 250 మంది వరకు ఓటర్లు ఉన్నారు.

ఎన్నికల నిర్వహణ తీరు

నేటి నుంచి ఈ నెల పదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 12న తిరష్కరణ, అభ్యర్థులు తిరిగి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 13న అప్పీలు చేసుకున్న దరఖాస్తులపై తుది నిర్ణయం, 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేష్ల ఉపసంహరణ, అదే రోజు 3 గంటల తరువాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. 19న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహణ సాగుతోంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. ఎక్కడైనా రీ పోలింగ్ పరిస్థితులు ఏర్పడితే 20వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించి వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు.

Advertisement

Next Story

Most Viewed