- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nizamabad : కమిషనర్లు వస్తారు.. పోతారు.. మేమిక్కడే లోక్కల్..అధికారుల తీరుపై కార్మికుల గుర్రు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కార్పొరేషన్ కు కమిషన్లు వస్తారు.. పోతారు.. చంటి గాడు లోకల్.. ఇక్కడే ఉన్నాడు.. ఇంకా ఉంటాడు.. ఇదేదో తెలుగు సినిమా డైలాగ్ లాగే ఉంది కదూ..? నిజమే.. తెలుగు సినిమా డైలాగే.. ఈ డైలాగుకు థియేటర్లోనైతే చప్పట్లు మారుమోగాయి.. కానీ ఇందూరులో మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చంటి గాడు లోకల్ అని విర్రవీగే అధికారులు, కింది స్థాయి సిబ్బంది వ్యవహారం సినిమాలో డైలాగ్ ను తలపిస్తోందని కార్పొరేషన్ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు అధికారులు.. ఆ అధికారుల అండతో చెలరేగిపోతున్న కింది స్థాయి సిబ్బంది చలాయిస్తున్న రుబాబు అంతా ఇంతా కాదంటున్నారు. వారి డామినేషన్ (Domination) ను తట్టుకోలేకపోతున్నామని కొందరు కార్పొరేషన్ ఉద్యోగులు, సిబ్బంది వాపోతున్నారు.
ఇది వరకు ఇక్కడ పనిచేసిన కమిషనర్ మకరందు కొంత కాలం నిత్యం క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పరిశీలించి, సిబ్బంది పనితీరు, అధికారుల పర్యవేక్షణ తీరును పరిశీలించడమే కాకుండా అభివృద్ధి పనులను కూడా పరిశీలించే వారు. కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ ను గాడిలో పెట్టేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. అక్కడక్కడా ఆయన గమనించిన అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది క్రమశిక్షణా రాహిత్యాన్ని మార్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో ఆయన కొంత మేర సక్సెస్ అయినప్పటికీ కార్పొరేటర్ల ఒత్తిళ్ల కారణంగా కొద్దిగా ఢీలా పడిపోయి వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ ల బదిలీల్లో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ను కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్తగా మరో కమిషనర్ దిలీప్ కుమార్ వచ్చారు. కమిషనర్ గా ఎవరొచ్చినా ఏం చేసేది ఉండదని, ఇక్కడంతా మనదే హవా కొనసాగుతుందని కార్పొరేషన్ ఉద్యోగులు, సిబ్బంది ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారని తెలుస్తోంది. వీరికి కొందరు కార్పొరేటర్లు రాజకీయ పార్టీల పెద్దలు కూడా భరోసా ఇస్తున్నట్టు సమాచారం.
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ ఇందూరు బల్దియా..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి, అక్రమాలకే కాదు.. నిరంకుశత్వానికి కూడా నిలువుటద్దంగా మారింది. ఎన్నో యేళ్లుగా పాతుకుపోయిన కొంత మంది ఉద్యోగులు తాము ఆడిందే ఆట.. పాడిందే పాటగా మున్సిపల్ కార్పొరేషన్ లో దర్జాగా రాజ్యమేలుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ కు ఏ కమిషనర్ వచ్చినా, ఏ విభాగంలో అధికారులు వచ్చినా కార్పొరేటర్ల కనుసన్నల్లోనే పనిచేయాలని, వారిని కాదని పని చేస్తే ఏ అధికారి కైనా రాజకీయ ఒత్తిళ్లతో చుక్కలు చూపిస్తారని ఇక్కడి నాయకులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. అధికారులతో సఖ్యతగా ఉంటున్నట్లు నటిస్తూనే చేయాల్సినదంతా చేసేస్తారని చెప్పుకుంటున్నారు. అధికారులకు కార్పొరేటర్ల సహకారం అధికారులు తమకు అనుకూలంగా ఉన్నంత వరకేనని లేదంటే ఇబ్బందులు తప్పవని ఒక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఇది వరకు పని చేసిన కమిషనర్లకు ముఖంపైనే దమ్ కి ఇచ్చినట్లు కార్పొరేషన్( Corporation)లో చెప్పుకుంటున్నారు. లక్షలు ఖర్చుపెట్టి ప్రజాప్రతినిధిగా గెలిచి వచ్చింది అధికారులకు భయపడి తమ ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు కాదని కార్పొరేటర్లు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
పదవీ కాలం ముగిసే సమయం దగ్గర పడుతున్న కొద్దీ అందినకాడికి సంపాదించుకోవాలనే తాపత్రయం కార్పొరేటర్లలో కనిపిస్తోందని, దీంతో మాపై ఒత్తిడి ఎక్కువవుతోందని కార్పొరేషన్ లోని ఒకరిద్దరు అధికారులు వాపోతున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకున్నా, నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, కమర్షియల్ నిర్మాణాలు జరుగుతున్నా వాటి విషయంలో తమకు వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవు పెట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలనిపిస్తోందని వాపోతున్నారు. మీతో ఈ విషయాలు మాట్లాడినట్లు తెలిస్తే ఇక మమ్మల్ని టార్గెట్ చేసి వేధిస్తారని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఇక్కడే మరిచిపోండని అధికారులు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నారు. ఈ పరిస్థితిని చూస్తే ఇందూరు బల్దియాలో అధికారులు, సిబ్బంది ఎంతటి అభద్రతా భావంతో పని చేస్తున్నారనేది స్పష్టమవుతోంది.
కార్పొరేటర్లకు బంగారు బాతు గుడ్డు ఖలీల్ వాడి..
నిజామాబాద్ నగరంలో ఖలీల్ వాడి పేరు చెప్తే అందరికీ గుర్తుకొచ్చేది దవాఖానాలే. ఖలీల్ వాడీ అంతటా నర్సింగ్ హోంలు, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, హాస్పిటల్ రిలేటెడ్ వ్యాపారాలే. ఈ ప్రాంతంలో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలవాలంటే కోట్లు పెట్టాల్సిందే. గెలిచాక సంపాదన కూడా రెట్టింపు రేంజ్ లో ఉంటుందనే టాక్ ఉంది. ఈ డివిజన్ లో అభ్యర్థులు గెలవాలంటే డాక్టర్ల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పుకుంటారు. ఎందుకంటే తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేటరే గెలవాలని డాక్టర్లంతా ఏకగ్రీవంగా కోరుకుంటారు. అందకు తగ్గట్లుగానే అంతర్గతంగా ప్రచారం చేస్తారు. అవసరమైన ఆర్థిక సాయం కూడా అందిస్తారు. ఇక ఈ డివిజన్ లో నిర్మించుకున్న హాస్పిటల్స్, ఇతర కమర్షియల్ కట్టడాల్లో దాదాపు 80 శాతానికి పైగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవే. నిర్మాణ సమయంలో అధికారులను, కార్పొరేటర్లను మేనేజ్ ఏదోలా ఎవరికెంత ముడుపులు ముట్టజెప్పాలో అంతగా ముట్టజెప్పి నిర్మాణాలు పూర్తి చేసుకుని వ్యాపారంలో బిజీగా సంపాదిస్తున్నారు. ఎన్నికైన కార్పొరేటర్ల దృష్టి ముందుగా వీరిపైనే పడుతుంది. కాబట్టి గెలిచే అవకాశాలున్న అభ్యర్థులతో సఖ్యత పెంచుకుని అంతర్గతంగా సహాయ సహకారాలు అందించే ఆనావాయితీని డాక్టర్లు అలవాటు చేసుకున్నారు. ఇప్పటి నుంచే ఆశావహులు డాక్టర్లతో, హాస్పిటల్ యాజమాన్యాలతో డీలింగ్ పెట్టుకొని కొందరు వ్యవహారం నడుపుతున్నారు.
కార్పొరేషన్ లో సంపాదించాలనే ఆలోచన వస్తే చాలు..
కార్పొరేషన్(Corporation) లో వివిధ విభాగాల్లో పని చేసే అధికారులకు అందినకాడికి సంపాదించుకోవాలనే ఆలోచన వచ్చిందంటే చాలు మార్గాలు వెతుకుతారట. రాచమార్గంలో చేయని పనులు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి లక్షలు కాజేయవచ్చనే సూత్రాన్ని కొంత మంది అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పాటిస్తున్నట్లు తెలుస్తోంది. వాడని వాహనాలకు డీజిల్ ఖర్చులు, కొద్ది రోజులుగా వాడకుండా షెడ్డులో ఉన్నప్పటికీ రన్నింగ్ కండిషన్ లోనే ఉన్న వాహనాలకు రిపేర్ల పేరుతో లక్షలు తగలేయడం వంటి స్కాంలు ఇక్కడి అధికారులు బాగానే చేస్తారనే టాక్ ఉంది. ఇది వరకు పలుమార్లు ఈ విషయంలో సంబంధిత అధికారులపై తీవ్ర ఆరోపణలు రాగా, అధికారులు సంజాయిషీలు కూడా కోరారు. కానీ వారిపై సరైన విచారణ లేకుండానే మమ అనిపించి క్లోజ్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారుల అండ ఉంటే పని చేయకున్నా చేసినట్లు ఏళ్లకేళ్లు అప్పనంగా లక్షల్లో జీతం కాజేయవచ్చని అడిగే నాథుడే లేడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పారిశుద్ధ్య సిబ్బందికి తప్పని వేధింపులు..
పారిశుద్ధ్య సిబ్బందికి అధికారులతో వేధింపులు ఎక్కువయ్యాయని, తమలో కొందరు పని చేయకున్నా వారిపై ఎలాంటి చర్యలుండవని, గాడిద చాకిరి చేస్తున్నప్పటికీ మమ్మల్ని పని విషయంలో అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని కొందరు పారిశుద్ధ్య సిబ్బంది వాపోతున్నారు. మా పై అధికారితో కొందరు సిబ్బంది సఖ్యతగా ఉంటూ అధికారుల వ్యక్తిగత పనులు చేస్తూ మున్సిపల్ పనులు చేయడం లేదని చెపుతున్నారు. వారి గురించి ఎప్పుడైనా ఉండబట్టలేక మాట్లాడితే మమ్మల్ని టార్గెట్(target) చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారి పర్యవేక్షణ సరిగా లేకపోవడం, కొందరు అధికారలు సిబ్బందిని పర్సనల్ పనులకు వాడుకోవడం కారణంగా కొంత మంది సిబ్బంది డ్యూటీకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతున్నారంటున్నారు. దినమంతా వారి వ్యక్తిగత పనులు, అధికారుల పనులు చేసుకుని సాయంత్రం వచ్చి కార్యాలయం వద్ద ముఖం చూపించి వెళుతున్నారని తోటి ఉద్యోగులే గొణుక్కుంటున్నారు. అధికారులతో సన్నిహితంగా వారికి అన్ని సౌలతులు ఇస్తూ, ప్రశ్నించిన వారి చేత గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అధికారులతో సన్నిహితంగా ఉండే కొంతమంది సిబ్బంది తమకు పని చేయాలని పిస్తే చేస్తారని, లేదంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారని చెపుతున్నారు. వారి పేర్లు బయటకు చెప్పినా, వారితో ఎదురు మాట్లాడినా, తమకే చిక్కులెదురవుతాయంటున్నారు. ఎప్పుడైనా యూనియన్ నాయకులు వచ్చి మమ్మల్‌ని పలకరించినా అధికారులు సంజాయిషీ అడుగుతున్నారని, వారేం అడిగారు.. మీరేం చెపుతున్నారని గట్టిగా ప్రశ్నిస్తున్నారని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి ఉద్యోగం వదిలేద్దామనిపించినా ఇంట్లో సమస్యలు, పిల్లల చదువులు గుర్తుకొచ్చి భరిస్తూ పని చేస్తున్నామని వారు వాపోయారు.
వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ పైనే ఉంది..
మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) లోని అన్ని విభాగాల్లో ఉన్న సమస్యలతో పాటు సిబ్బంది విచ్చలవిడి తనం, అవినీతి, అక్రమాలు, విధుల్లో నిర్లక్ష్యం, విధుల్లోకి రాకున్నా అటెండెన్స్ మేనేజ్ చేస్తూ అప్పనంగా వేతనాలు తీసుకోవడం తదితర అన్ని సమస్యలపై దృష్టి పెట్టి బల్దియా గు వ్యవస్థను గాడిలో పెట్టిల్సిన బాధ్యత కొత్తగా ఛార్జ్ తీసుకున్న కమిషన్ పై ఉంది. ఈ విషయంలో కొత్తగా వచ్చిన కమిషనర్ దిలీప్ కుమార్ సక్సెస్ కావాలని దిశ కోరుకుంటుంది.
సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తా : దిలీప్ కుమార్,నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్
కమిషనర్ గా బాధ్యతలు తీసుకుని వారం రోజులు కూడా కాలేదు. ఇంకా కార్పొరేషన్ పైన, కార్పొరేషన్ లోని వివిధ విభాగాల పైన స్టడీ చేయాల్సి ఉంది. వాటిపై అన్ని విషయాలను అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఏదేమైనా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎలాంటి సమస్యలున్న వాటన్నింటిపై దృష్టి కేంద్రీకరిస్తా. నగర ప్రజలకు ఇబ్బందులు ఎదురవకుండా చూస్తా.