- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Staff Nurse'ల ఇష్టారాజ్యం.. ప్రశ్నించిన అధికారులపై లైంగిక దాడి కేసులు..?
దిశ, కర్నూలు ప్రతినిధి: ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన స్టాఫ్ నర్సులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా..? రాత్రి డ్యూటీ చేయాలని చెప్పే అధికారులను ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు లైంగిక దాడి కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారా ?, వీరి తీరుతో వైద్యులు నిస్సహాయ స్థితిలో ఉంటున్నారా ? ఈ విషయాలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదా ? అంటే అవుననే సమాధానం వినిస్తోంది. స్టాఫ్ నర్సులు ఆ వృత్తికి కళంకం తెస్తూ సేవలను నీరు గారుస్తున్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతూ విష సంస్కృతికి బీజం వేస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీహెచ్సీలు 18, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 87, అర్బన్ హెల్త్ సెంటర్లు 44, ఏరియా ఆస్పత్రులు 5 ఉన్నాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, సీటీ ఒకరు, ఫార్మాసిస్టు ఒకరు, ఎంఎన్ఓలు ముగ్గురు, ఎఫ్ఎన్ఓ ఒకరు, సూపర్ వైజర్ ఒకరు, జూనియర్ అసిస్టెంట్ ఒకరు చొప్పున ఉంటారు. వీరిలో స్టాఫ్ నర్సుల తీరు ప్రజలకు ఇబ్బందిగా మారింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు చొప్పున ఉండే వీరిలో ఒక్కొక్కరు కేవలం పది రోజుల పాటు విధులు నిర్వహించాల్సి ఉంది.
కానీ ఎవరు కూడా రాత్రి వేళల్లో వివిధ కారణాల నెపంతో విధులు నిర్వహించడం లేదనే విమర్శలున్నాయి. ఈ విషయాలపై సంబంధిత వైద్యాధికారులు స్టాఫ్ నర్సులను నిలదీసి రాత్రి విధులు ఎందుకు నిర్వహించడంలేదని, ఇలా చేస్తే ఉన్నతాధికారుకు రిపోర్టు చేస్తానని హెచ్చరిస్తే వారిపై కక్ష పెంచుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్టాఫ్ నర్సులు తప్పుడు కేసులు పెడుతున్నట్లు వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరైతే వీరి ఆగడాలు భరించలేక ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుంటున్నారు. లేదంటే దీర్ఘకాలిక సెలవు పెడుతున్నారు.
డ్యూటీ చేయమన్నారో జైలుకే..!
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. అందులో వివిధ కేడర్లలో 13 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆరోగ్య కేంద్రం పరిధిలో దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో చెంచులు, ఇతర సామాజిక తరగతికి చెందిన ప్రజలు వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తుంటారు.
ఇక్కడ సరైన వైద్య సేవలు అందించకుంటే 24 కిలోమీటర్ల దూరంలో ఉంటే కొత్తపల్లి, దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉండే ఆత్మకూరు పట్టణ కేంద్రాలకు వెళ్లాల్సిందే. అయితే ఇక్కడ విధులు నిర్వహించే స్టాఫ్ నర్సులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో ముగ్గురు స్టాఫ్ నర్సులున్నారు. వీరు నెలకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వేతనాలు తీసుకుంటున్నారు. వీరు ఏనాడూ రాత్రి విధులకు హాజరైన దాఖలాలు లేవు.
2020లో సత్యంరెడ్డి అనే ఉద్యోగిని, 2021లో వైద్యాధికారి శ్రీనివాసులు నాయుడును రకరకాల కారణాలతో కేసులు బనాయించి జైలుకు పంపారు. వీరికి పేషెంట్ శీలం యేసురత్నం, మరి కొందరు సహకరించారు. ఇలా ప్రజా వైద్యాన్ని అపహాస్యం చేస్తూ 24 గంటలూ అందాల్సిన సేవలకు తిలోదకాలిస్తున్నారు.
నా మాట వినడంలేదు: సౌజన్య, వైద్యాధికారిణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎర్రమఠం
ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ఎవరూ ఉండడం లేదని నా దృష్టికి వచ్చింది. కానీ ఇక్కడ సిబ్బంది నా మాట లెక్క చేయడం లేదు. దీంతో వారిని ఏమీ అనలేకపోతున్నాను. ఐదు రోజుల నుంచి గ్రామానికి చెందిన వారు సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. దీంతో నేను జిల్లా ఉన్నతాధికారికి రిపోర్టు పంపాను. ఇక్కడ అంబులెన్స్ అవసరమని చెప్పాను.
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, నంద్యాల జిల్లా
స్టాఫ్ నర్సులు రాత్రి విధులు నిర్వహించడం లేదని ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా వైద్య శాఖ పని చేస్తుంది. అందుకు ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. ఎక్కడా కూడా వైద్య సేవలు అందలేదని ప్రజలు తమకు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
ఇవి కూడా చదవండి : ఎన్నికల వేళ సర్కార్‌కు ‘TSPSC’ గండం.. యువత దూరం అవుతోందని BRS లో కొత్త టెన్షన్..!