Ap News: అలా గాని జరిగితే వలంటీర్ల వ్యవస్థ రద్దు!

by srinivas |
Ap News: అలా గాని జరిగితే వలంటీర్ల వ్యవస్థ రద్దు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వలంటీర్ల వ్యవస్థపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు కచ్చితంగా వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి జన్మభూమి కమిటీలను మళ్లీ తెరపైకి తీసుకువస్తారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు చాలా ఆరోపణలు చేశారని.. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించారని గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మడలపరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 264 మందికి సేవ మిత్ర, ఐదురికి సేవా రత్న, ఒకరికి సేవా వజ్ర అవార్డులను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ వలంటీర్లు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేస్తున్న సంక్షేమ సారధులని కొనియాడారు. వలంటీర్ల సేవాభావం వల్ల కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 25 రకాల పథకాలకు వలంటీర్లే బ్రాండ్‌ అంబాసిడర్లని.. డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు సీఎం జగన్ అందించడంలో వారి పాత్ర మరువలేనిదని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని స్వచ్ఛందంగా మంచి చేయాలని అడుగులు వేస్తున్న మంచి మనుషులని ధర్మాన కృష్ణదాస్ పొగడ్తలు కురిపించారు. వలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంటని మండిపడ్డారు. చంద్రబాబు ఆపాదించిన దురుద్దేశాలు బాగా గుర్తు పెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా వలంటీర్లు ప్రజలకు చూపించాలని ధర్మాన కృష్ణదాస్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story