విప్లవాత్మకమా..? వైఫల్యమా..?

by S Gopi |
విప్లవాత్మకమా..? వైఫల్యమా..?
X

"మాకు అమ్మఒడి వస్తోంది సార్. చేయూత కింద ఏటా రూ.18,750 ఇస్తున్నారు. బతకడానికి ఇవి సరిపోవు కదా సార్. నేను బేల్దారి పనికి వెళ్తుంటా. ఏరోజుకారోజు పని దొరుకుతుందో లేదో తెలీదు. ఇక్కడ నుంచి బండిలో పెట్రోలు పోసుకుని వెళ్లాలి. మెట్టు దగ్గర పని కోసం ఎదురు చూడాలి. ఎవరైనా వచ్చి ఇద్దరు కూలీలు కావాలని పిలిస్తే పదిమందిమి తోసుకెళ్తున్నాం. ఇసుక, సిమెంటు, ఐరన్​రేట్లు తెగ పెరిగాయని పెద్దగా పనులు చేయించడం లేదు. పని దొరక్కుంటే ఉసూరుమంటూ తిరిగి ఇంటికి పోవాలి. ఈ అగచాట్లు ఇంకెన్నాళ్లు సార్​!" అంటూ ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

అది గుంటూరు సమీపంలోని జొన్నలగడ్డ గ్రామం. అతను రోజూ మోపెడ్‌పై 12 కిలోమీటర్ల దూరానున్న గుంటూరు టౌన్ లాడ్జి సెంటర్‌కు చేరుకుంటాడు. పని దొరికితే సంతోషపడతాడు. లేకుంటే జేబులో వేసుకొచ్చిన చిల్లరతో పెట్రోలు కొట్టించుకొని దిగాలుగా ఇంటిబాట పడుతుంటాడు. వారంలో గట్టిగా మూడు లేదా నాలుగు రోజులే పని దొరుకుతున్నట్లు వాపోయాడు. గత ఎన్నికల్లో వాళ్ల ఎస్సీ కాలనీ మొత్తం వైసీపీకే ఓటేసినట్లు చెప్పాడు. ఈ దఫా మారిపోతారా అంటే " ఎన్నికలు ఇప్పుడు లేవు కదా ! అసలు జగన్​ఎందుకు ఇలా చేస్తున్నాడో ఆయనతోనే తేల్చుకుంటాం!" అంటూ అక్కడే ఉంటే ఇంకేం అడుగుతారోనన్నట్లు అటు ఇటు చూసి వెళ్లిపోయాడు.

దిశ, ఏపీ బ్యూరో: అదే గ్రామంలో రెడీమేడ్ గార్మెంట్స్ దుకాణదారుడిని కదిలిస్తే.. "ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నారు. ఒక్కటన్నా శాశ్వత ఉపాధి కల్పిస్తుందా ! ఇంతకు ముందు ఏదన్నా దుకాణం పెట్టుకుంటామంటే బీసీ కార్పొరేషన్ నుంచి సబ్సిడీ రుణాలు వచ్చేవి. వాటితో షామియానా షాపులు, దుస్తుల దుకాణాలు.. ఇలా ఎవరికి తోచింది వాళ్లు పెట్టుకుంటే ఇంటి నిండా పని ఉండేది. ఇవ్వాళ అవేమీ లేవు. ఓ వైపు ఉద్యోగాలు దొరక్క.. ఇలా సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి రుణాలు అందడం లేదు ఎలా బతకాలి సార్​! " అంటూ నిర్మొహమాటంగా మనసులోని బాధను వెళ్లగక్కాడు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనపై వీళ్ల స్పందనిదీ..

దీనికి భిన్నంగా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పాలనను గ్రామ, వార్డు స్థాయికి తీసుకెళ్లాం. పాడైన వ్యవస్థలన్నింటినీ సరి చేస్తున్నాం. నవరత్నాలతో ప్రజలంతా సుఖశాంతులతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాడు–నేడుతో ప్రభుత్వ విద్యా, వైద్యరంగాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. పొదుపు మహిళల దగ్గర నుంచి రైతన్నలకు ఎంతో చేస్తున్నాం. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతి సంక్షేమ పథకాన్నీనేరుగా అర్హత కలిగిన లబ్ధిదారుడికి అందిస్తున్నాం. వలంటీర్ల వ్యవస్థతో గడపగడపకూ రేషన్​సరుకులతోపాటు సామాజిక పింఛన్లు చేరవేస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా వల్లెవేయని రోజు లేదు. సంక్షేమ పథకాలకు ఆద్యులమంటూ దండోరా వేసుకోని సందర్భం లేదు. మరి శ్రామిక జనావళిలో ఈ అసంతృప్తి ఎలా నెలకొందో పరిశీలించే తీరిక ఏలికలకు లేదా అంటూ పలువురు విశ్లేషకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్​రద్దు చేయాలని అడిగిన పాపానికి వాళ్ల పీఆర్సీకే ఎసరు పెట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా సంస్కరణల్లో భాగంగా ఉపాధ్యాయులు, స్కూళ్ల క్రమబద్ధీకరణలో లోపాలను ఎత్తి చూపినందుకు ఉపాధ్యాయులనే టార్గెట్​చేశారు. ఆరేళ్ల పిల్లలు మూడు కిలోమీటర్ల దూరానున్న బడికి ఎలా వెళ్తారనే ఆలోచన చేయలేదు. ఓ వైపు నాడు–నేడు పనుల పర్యవేక్షణతోపాటు రకరకాల యాప్‌లను నెత్తికెత్తారు. అదనపు బాధ్యతలను తప్పిస్తే బోధనపై దృష్టి కేంద్రీకరిస్తారని సెలవిచ్చారు. ఎప్పుడో ఐదేళ్లకోసారీ జరిగే ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్‌లు జారీ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలు అన్నీఇన్నీకావని ఆయా సంఘాలు గగ్గోలెత్తుతున్నాయి. కాంట్రాక్ట్, అవుట్​సోర్సింగ్​ఉద్యోగులను రెగ్యులర్​చేస్తామన్న హామీని అటకెక్కించారు. మళ్లీ అమలు చేస్తున్నామని చెప్పుకునేందుకు సవాలక్ష కొర్రీలు వేస్తున్నారు.

ఎవరి సహకారం లేకుండానే అనేకమంది యువత ఫ్లెక్సీ ప్రింటింగ్​‌తో ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరు మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వాటిపై నిషేధం పెట్టి వాళ్ల పొట్టగొట్టారు. 200 మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్ ఫ్లెక్సీ భూమిలో కలిసిపోతుంది. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందీ లేదని నిపుణులు చెబుతున్నారు. కాకుంటే దాన్ని 250 లేదా 300 మైక్రాన్లుండే ఫ్లెక్సీ వేసుకోమని చెప్పొచ్చు. అదిగాకుండా ప్రింటింగ్​ నిలిపేయాలని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఉపాధికి గండి పడింది. కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేకపోగా ఇలా స్వయం ఉపాధిని దెబ్బతీయడమేంటని ఫ్లెక్సీ ప్రింటర్లు వాపోతున్నారు.

ఇలా చెప్పుకుంటూపోతే కౌలు రైతులను పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసేశారు. కౌలు ధరలను ఇష్టారీతిన పెంచుతున్నా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. పైగా కౌల్దారీ చట్టంలో భూ యజమాని అనుమతి పత్రం తప్పనిసరి చేయడంతో కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందకుండా పోతోంది. ఆక్వా రైతుల సమస్యలకూ పరిష్కారం లభించలేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని పక్కదారి పట్టించారు. పంచాయతీల నిధుల విషయంలోనూ సర్పంచ్‌లు గుర్రుగా ఉన్నారు. పోర్టులను అదానీ పరం చేశారు. ధర్మల్​విద్యుత్ కేంద్రాలనూ అప్పగించేందుకు సిద్ధమయ్యారు. కేంద్రం నుంచి హోదా తేలేకపోయారు. పోలవరానికి నిధుల విషయంలో నిలేయలేని దుస్థితికి జారిపోయారు. ఇక విశాఖ స్టీల్‌ను తెగనమ్ముతున్నా నోరు విప్పలేని దయనీయస్థితిలోకి దిగజారాక ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా ఎలా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులు చేపట్టామంటోంది. ఇది బాధ్యతారాహిత్య పాలనా వైఫల్యమని పరిశీలకులు చెబుతున్నారు. ఏది వాస్తవమనేది రానున్న ఎన్నికలు నిగ్గు తేల్చనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed