ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..విభజన హామీల కోసం పోరాడుతా: మంత్రి కోమటిరెడ్డి

by Seetharam |
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..విభజన హామీల కోసం పోరాడుతా: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా నాడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాడు ప్రధాని ఇచ్చిన హామీని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు.కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని ఇలాంటి తరుణంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనిని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో తనవంతు కృషి తప్పక ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తాం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం అనేక హామీలు ఇస్తే వాటిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే దేశరాజధాని ఢిల్లీలో త్వరలో తెలంగాణ భవన్ నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం హైదరాబాద్ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో ఈ అంశంపై చర్చిస్తానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) చైర్మన్‌‌ను కలిసి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో 340 కిలోమీటర్ల మేర హైవేను ఆరు లైన్లుగా అభివృద్ధి చేయాలని ఎన్‌హెచ్ఏఐ చైర్మన్‌ను కోరనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story