తల్లి శవంతోనే నాలుగు రోజులు.. తిరుపతిలో హృదయ విదారక ఘటన

by Sathputhe Rajesh |
తల్లి శవంతోనే నాలుగు రోజులు.. తిరుపతిలో హృదయ విదారక ఘటన
X

దిశ, రాయలసీమ: ఓ పదేళ్ల బాలుడు తన తల్లి మరణించిన విషయాన్ని గుర్తించలేదు.తల్లి నిద్రపోతుందని భావించి నాలుగు రోజులుగా స్కూలుకు వెళ్లొచ్చేవాడు.రోజు ఉదయాన్నే నిద్రలేచే తన తల్లి నాలుగు రోజులుగా అలాగే నిద్రిస్తున్నా ఏమైందో ఆ బాలుడికి అర్థం కాలేదు. అమ్మ నిద్రిస్తుందనుకుని భావించి తానే రోజు స్కూలుకు వెళ్లివస్తున్నాడు. ఇంట్లో ఉన్న తినుబండారాలతో నాలుగు రోజులు గడిపాడు. తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తెలియక ఆమె పక్కనే నిద్రిస్తున్నాడు. అయితే ఇంట్లో ఏదో కుళ్లిపోయిన వాసన వస్తోందని బాలుడు మేనమామకు ఫోన్ చేశాడు. ఆయన వచ్చి చూసేసరికి అసలు విషయం తెలిసింది. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం విద్యానగర్ కాలనీలోని ఓ ఇంట్లో రాజ్యలక్ష్మి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రైవేటు లెక్చరర్‌గా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి భర్తతో విబేధాలు రావటంతో రెండేళ్లుగా కుమారుడితో పాటు తిరుపతిలో నివాసం ఉంటోంది. ఆమె కుమారుడు శ్యామ్ కిషోర్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. మృతురాలు ఈనెల 8న రాజ్యలక్ష్మి మంచం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆమె నిద్రపోతోందని భావించిన శ్యామ్ కిషోర్ నాలుగురోజులుగా మృతదేహాంతోనే ఉన్నాడు. నిన్న శ్యామ్‌కిషోర్ వాళ్ల మేనమామ దుర్గాప్రసాద్‌కు ఫోన్‌ చేసి ఇంట్లో వాసన వస్తోందని చెప్పాడు. దీంతో దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం బయటపడింది. శ్యామ్ కిషోర్‌కు మానసిక స్థితి సరిగా లేదని మేనమామ దుర్గాప్రసాద్ చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

Advertisement

Next Story