వైఎస్ఆర్ జపం పని చేస్తుందా.. షర్మిల దూకుడు ఎవరికి ప్రయోజనం

by Ramesh Goud |   ( Updated:2024-01-27 11:01:23.0  )
వైఎస్ఆర్ జపం పని చేస్తుందా.. షర్మిల దూకుడు ఎవరికి ప్రయోజనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు హోరెత్తుతుంది. అధికార, విపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఏపీలో ఎన్నికల పోరు మూడు పార్టీల మధ్యే ఉంటుందని అంతా అనుకున్నారు. అందులో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడంతో త్రిముఖ పోరు కాస్త, ద్విముఖ పోరుగా మారింది. అనూహ్యంగా ఏపీలో మనుగడలో కూడా లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ వేసింది. పార్టీలోకి దివంగత వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిలను తీసుకొని, ఏకంగా పార్టీ పగ్గాలు ఒప్పజెప్పడంతో రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి.

దూకుడు పెంచిన కాంగ్రెస్ చీఫ్..

వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక రాజకీయాల్లో దూకుడు పెంచింది. తన మాటకారితనంతో అటు అధికారంలో ఉన్న తన సోదరుడు, సీఎం జగన్ తో పాటు.. ఇటు విపక్షాలను కూడా కడిగి పారేస్తుంది. షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చాక కాంగ్రెస్ నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ నూతనోత్సాహం నింపింది. మొన్నటివరకు దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ కి షర్మిల రాకతో అసెంబ్లీలో అడుగు పెడతామన్న నమ్మకం వచ్చింది.

రాజన్న జపం పనిచేస్తుందా..

వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన నాటి నుండి వైఎస్ జపం వల్లిస్తుంది. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మళ్లీ దివంగత నేత రాజన్న రాజ్యం చూడబోతున్నామని పదే పదే చెబుతోంది. సీఎం జగన్ రాజన్న పాలన తెచ్చానని అంటున్నారని, రాజన్న పాలన ఎక్కడ ఉందో చూపించాలని అధికార పక్ష నేతలకి సవాల్ విసురుతోంది. మరి ఈ రాజశేఖర్ రెడ్డి జపం కాంగ్రెస్ కి సక్సెస్ మంత్రంలా పని చేస్తుందా.. కనీసం ఒక్క సీటైనా సాధించిపెట్టగలదా..? చూడాలి.

షర్మిల దూకుడు ఎవరికి ప్రయోజనం..

షర్మిల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండే జగన్ పాలనపై విరుచుకుపడుతుంది. జగన్ చేసిన అభివృద్దిని చూపించాలని, అంటూనే.. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే విపక్షాలు పోరాడకుండా ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తుంది. అసలు ఈ దూకుడు కాంగ్రెస్ కి ప్రయోజనం చేకూర్చేందుకేనా..? లేక మరేవరికైనా లాభంగా మారే అవకాశం ఉందా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. వైఎస్ఆర్ జపం వల్ల కాంగ్రెస్ కి లబ్ది చేకూరుతుందన్న మాట పక్కన పెడితే, జగన్ వ్యతిరేక ఓట్లు చీలి, విపక్షాలకు ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story