ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట: సీబీఐ విచారణకోసం దాఖలపై పిటిషన్ కొట్టివేత

by Seetharam |
Rajahmundry Court Extends Remands to MLC Anantha Babu
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు అయ్యారు. అంతేకాదు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ అనంతబాబు తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ హైకోర్టు ఎమ్మెల్సీ అనంతబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు రాజకీయ వ్యవహారాల్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని, సీబీఐకి ఈ కేసును అప్పగించాలని కోరుతూ మృతుడి తల్లితండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. తాజాగా డిసెంబర్ 1న ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ మేరకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సీబీఐకు ఈకేసు విచారణను అప్పగించడాన్ని తిరస్కరించింది. గతంలో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీ హైకోర్టు సమర్థించింది. సీబీఐ విచారణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.

ఎమ్మెల్సీ భార్యపై అనుమానాలు

ఇకపోతే దళితుడైన తన కారు డ్రైవర్ వీధి సుబ్రమణ్యాన్ని హత్య చేయడమే కాకుండా డోర్ డెలివరీ చేసిన ఘటనపై ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ హైకోర్టులో జరుగుతుంది. ఈ కేసులో కేవలం ఎమ్మెల్సీ అనంతబాబును మాత్రమే నిందితుడిగా చేర్చారు. కానీ సీసీటీవీ ఫుటేజీలో ఆయన భార్య సహకారం కూడా ఉన్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమెను నిందితురాలిగా చేర్చకపోవడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. పోలీసులు విచారణ సరిగా చేయలేదని... సీసీటీవీ ఫుటేజ్ వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మరోవైపు ఈ హత్య కేసును నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు వాదనలు పూర్తి చేసింది. చివరకు సీబీఐ విచారణకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

Advertisement

Next Story