ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎమ్మెల్యే తిప్పేస్వామిలపై తిరుగుబాటు..?

by Mahesh |   ( Updated:2022-12-15 05:18:16.0  )
ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎమ్మెల్యే తిప్పేస్వామిలపై తిరుగుబాటు..?
X

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర, హిందూపురం లో వైసీపీ అసమ్మతి నేతలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మడకశిరలో ఎమ్మెల్యే, హిందూపురంలో ఎమ్మెల్సీ ఆగడాలను తాళలేకే వారు ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. గురువారం జరిగే సమీక్ష సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డికి 'సీక్రెట్ రూమ్ సంభాషణలు' వినిపించేందుకు వైరి వర్గం సన్నద్ధమైంది. ఎమ్మెల్యే బాధితులను కూడా వారు తమతో తీసుకెళ్తున్నట్లు సమాచారం.

దిశ, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఒకటి రెండు ఘటనలు మినహా ప్రశాంతంగా సమీక్ష సమావేశాలు జరుగగా ... శ్రీ సత్యసాయి జిల్లాలో సమీక్ష సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో గురువారం హిందూపురం నియోజకవర్గ సమీక్ష పూర్తయిన తర్వాత మడకశిర సమీక్ష నిర్వహించనున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైఖరిపై అసమ్మతి నేతలు గుర్రుగా ఉన్నారు.

ఆ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యలో ఇక్బాల్ పాత్ర ఉండటం, హత్య కేసు నిందితుల సంభాషణలు వైరల్ గా మారిన నేపథ్యంలో సుమారు ఒకటిన్నర నెలల పాటు ఆయన హిందూపురానికి రాలేదు. నియోజకవర్గ సమీక్ష సమావేశాల సమాచారం తెలుసుకొని కొద్దిరోజుల ముందే హిందూపురం వచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం, సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టించడం లాంటి ఆరోపణల నేపథ్యంలో గురువారం నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగనుంది.

ప్రతి పనికి లంచమే...

మడకశిర నియోజకవర్గ సమీక్ష సమావేశానికి ముందే అక్కడి నేతలు అసంతృప్తి గళం విప్పారు. స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు పూర్తిగా డబ్బు పిచ్చి పట్టుకుని ప్రతి పనికీ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే కుల రాజకీయాలతో అడ్డుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అవినీతి, అక్రమాలకు సంబంధించి " సీక్రెట్ రూమ్ సంభాషణలు" పేరుతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందే ఆడియో, వీడియో సంభాషణలను వినిపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పై తీవ్ర అసంతృప్తి..

హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఖరిపై సొంత పార్టీ నాయకులు అసమ్మతి రాగం ఎత్తుకుంటున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పోలీసు రుబాబు చూపిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కకు పెట్టి అధికారులు, పోలీసులు సలహాలను పాటిస్తూ, తన సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేస్తున్నాడని అసమ్మతి నాయకులు ఆరోపిస్తున్నారు.

హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పీఏ గోపీకృష్ణ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరం జరుగుతూ వచ్చారు. ఆ క్రమంలోనే నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణా రెడ్డి హత్య జరిగింది. అందులో ఎమ్మెల్సీ పాత్రపై అనుమానాలు వ్యక్తం కాగా బాధితులు, అసమ్మతి నాయకులు ఆయనను సైతం కేసులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆయనను నియోజకవర్గం లోకి రానివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేశారు.

సొంత వారిపైనే కక్షసాధింపు..

ఇక మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఖరిపై అసమ్మతి నాయకులు మండిపడుతున్నారు. ఆయన తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారిపైనే కక్ష గట్టి బెదిరింపులు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేకు పూర్తిగా డబ్బు పిచ్చి పట్టుకుందని ప్రతి పనికీ ఏ ఒక్కరినీ వదలకుండా డబ్బులు గుంజుతూ ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు మహిళలను సైతం లైంగికంగా వేధింపులకు గురి చేయడం లాంటి ఆరోపణలు సైతం ఉండటం గమనార్హం. వాటన్నింటినీ ఎవరైనా ప్రశ్నిస్తే కులాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయాలు చేస్తుంటాడన్న ప్రచారం ఉంది. పార్టీ కోసం కష్టపడిన వారిని దగ్గరకు రానివ్వకుండా బ్రోకర్లను, డబ్బులు ఇచ్చే వారిని దగ్గరకు చేర్చుకుంటున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.

అసమ్మతి నాయకులకు పోలీసు బెదిరింపులు..

ఈ రెండు నియోజకవర్గాలలోనూ అసమ్మతి నాయకులు నోరు విప్పకుండా పోలీసులతో బెదిరింపులు చేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా వారి వ్యవహార శైలి ని ప్రశ్నిస్తే వారిపై కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ కు పిలిపించి బెదిరిస్తున్నారని అసమ్మతి నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో హిందూపురం నియోజకవర్గంలో అసమ్మతి నాయకులు ఏకమై పోలీసులకు వ్యతిరేకంగా ఇన్చార్జి మంత్రి, ప్రభుత్వ సలహాదారు, ఆఖరుకు ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడిన తమను పోలీసులతో బెదిరిస్తే ఇంకా మామూలు ప్రజల పరిస్థితి ఏంటని వారు వారికి విన్నవించారు.

ఇక మడకశిర నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న పోలీసులను ఉపయోగించుకుని అసమ్మతి నాయకులను భయపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగనున్న ముందు రోజు మడకశిర నియోజకవర్గంలోని ముఖ్యమైన 15 మంది నాయకులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి బెదిరించారని అసమ్మతి నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకే తాము ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు "బచావ్ మడకశిర" నినాదం వినిపిస్తామని వారు తేల్చి చెబుతున్నారు. తమకు పార్టీ ముఖ్యమని ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదని అంటున్నారు.

పెద్దిరెడ్డి ముందుకు పంచాయతీ...

పెద్దిరెడ్డి ముందు వినిపించనున్న సీక్రెట్ రూమ్ సంభాషణలు హిందూపురం, మడకశిర నియోజకవర్గ సమీక్ష సమావేశాలలో హిందూపురం నియోజకవర్గంలో పార్టీ అసమ్మతి నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేయనున్నట్లు తెలిసింది. ఇందులో క్షేత్రస్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారిని ఎమ్మెల్సీ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందీ ఉదాహరణలతో సహా వినిపించనున్నట్లు సమాచారం. ఆయన, ఆయన పీఏ చేసిన అవినీతి, అక్రమాలు పార్టీ కార్యకర్తలు, నాయకులను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేసింది. బాధితులతోనే వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అందరూ కలిసికట్టుగా ఉండాలని అసమ్మతి నాయకులు అందరూ కూడబలుక్కున్నట్లు తెలిసింది.

పోలీసు స్టేషనుకు పిలిపించి బెదిరింపులు?

ఇక మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సంబంధించిన అవినీతి, అక్రమాలను అన్నింటినీ "సీక్రెట్ రూమ్ సంభాషణలు" పేరుతో ఆడియో, వీడియోల రూపంలో సేకరించి పెట్టుకున్న అసమ్మతి నాయకులు నియోజకవర్గ సమీక్షలో మంత్రి ముందు వాటిని వినిపించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి బుధవారం సాయంత్రం సుమారు 15 మంది నాయకులకు పోలీస్ స్టేషన్ కు పిలిపించి బెదిరించినట్లు అసమ్మతి నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అసమ్మతి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి చేసిన అవినీతి, అక్రమల చిట్టాను మీడియా సమావేశంలో విప్పారు.

మడకశిర నియోజకవర్గంలో సిమెంట్ కుంభకోణంలో ఒక ఇంజనీర్ 10 లక్షలు ఇవ్వనందుకు అతడిని సస్పెండ్ చేయించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన దేవానంద్ అనే సీఐ ఆయన మాట విననందుకు సస్పెండ్ చేయించారని తెలిపారు. నియోజకవర్గంలో ఎవరైనా ఇల్లు కడితే డబ్బులు ఇవ్వాల్సిందేనని, వీటన్నింటిపైనా ఎవరైనా ప్రశ్నిస్తే కుల రాజకీయాలతో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. నియోజకవర్గం లో ఆడవాళ్ళ పరిస్థితి చాలా భయానకంగా ఉందని తెలిపారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని, మంత్రి పెద్దిరెడ్డి ముందు ఆయన అవినీతి, అక్రమాల చిట్టా విప్పనున్నామని వారు బహిరంగంగానే పేర్కొన్నారు.

రసాభాస కానున్న సమీక్ష సమావేశాలు?

హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలో వైసీపీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలలో అసమ్మతి నాయకులు అందరూ ఏకమై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలపై తిరగబడనున్నట్లు సమాచారం. దీంతోపాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల కు సంబంధించిన అవినీతి, అక్రమాల చట్టాలను సైతం అసమ్మతి నాయకులు దగ్గర పెట్టుకుని బాధితులను సైతం అక్కడికి తీసుకు వెళ్ళనున్నట్లు తెలిసింది. దీంతో రెండు నియోజకవర్గాలలో నియోజకవర్గ సమీక్ష సమావేశాలు రసాభాసగా మారనున్నాయన్న ఆందోళన అధికార పార్టీలో వ్యక్తం అవుతోంది.

తండ్రి వైఎస్‌కు పట్టిన గతే CM జగన్‌కు పడుతుంది: TDP మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story