Rain Disaster: ఏపీలో ఆ మూడు పట్టణాల్లో వరద బీభత్సం.. రెడ్ అలెర్ట్ జారీ

by Ramesh Goud |   ( Updated:2024-08-31 14:23:07.0  )
Rain Disaster: ఏపీలో ఆ మూడు పట్టణాల్లో వరద బీభత్సం.. రెడ్ అలెర్ట్ జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగాళఖాతంలో వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని మూడు ప్రధాన పట్టణాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. విజయవాడ, మంగళగిరి, గుంటురులో వానలు దంచికొడుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపై నీరు చేసి వాహానాల రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షాలతో జనజీవనం సైతం స్థంభించిపోయింది. గుంటూరు, మంగళగిరి ఖాజా టోల్ ప్లాజా వద్ద భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు వరద నీటిలో చిక్కుకొని పోయాయి. టోల్ ప్లాజా వద్ద నీరు సముద్రాన్ని తలపిస్తుంది. దీనిపై స్థానిక సీఐ మాట్లాడుతూ.. వాహనదారులు ఖాజా టోల్ వైపు రావొద్దని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని, జడివాన కారణంగా ప్రాణాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.

విజయవాడలో వాగులను తలపిస్తున్న రోడ్లు

అలాగే విజయవాడలో కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కాలనీలు నీట మునిగాయి. వన్ టౌన్ చెట్టు సెంటర్ లో వీధులపై నడుము లోతులో నీళ్లు నిలిచాయి. దీంతో ఇళ్లలో నుంచి బయటకి రాలేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుండపోత వర్షాలతో విజయవాడ రోడ్లు వాగుల్లా మారాయి. వన్ టౌన్ ఏరియాలో రైల్వే బ్రిడ్జి కింద రెండు బస్సులు, లారీ వరదలో చిక్కుకుపోయాయి. బస్సులోని వ్యక్తులు స్థానికుల సహాయంతో బయట పడ్డారు. అలాగే భారీ వర్షాల కారణంగా విజయవాడ దుర్గగుడి దర్శనాలు మూసివేశారు. వరదల వల్ల ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఘాట్ రోడ్డుపై వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతేగాక గుడి సమీపంలో కొండరాళ్లు విరిగి పడటంతో సమాచార కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఇక మొగల్రాజపురం సున్నపుభట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే నలుగురు మృతి చెందారు. సంఘటన స్థలం వద్ద పోలీసులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నీట మునిగిన పంట పోలాలు

భారీ వర్షాల దెబ్బకు గుంటూరు జిల్లా వణుకిపోతోంది. వరదల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలా చోట్ల పంటపోలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీ వర్షాలపై వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వరదలపై ఆయా శాఖల మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పలు ఏరియాలు నీట మునగడంపై ఆరా తీస్తూ.. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Advertisement

Next Story