పురంధేశ్వరి,చంద్రబాబు, బాలకృష్ణలను బయటకు లాగుతా.. రాజకీయాల్లో ఉండనివ్వను

by Seetharam |   ( Updated:2023-08-28 11:00:11.0  )
పురంధేశ్వరి,చంద్రబాబు, బాలకృష్ణలను బయటకు లాగుతా.. రాజకీయాల్లో ఉండనివ్వను
X

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత మాజీ సీఎం, నందమూరి తారక రామారావు పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రూ.100 నాణేం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం పట్ల నందమూరి లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సతీమణి అయిన తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వారే నేడు వారసులుగా చెలామణి అవుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణేం విడుదల చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన లక్ష్మీపార్వతి ఆ వేడుకకు తనను ఆహ్వానించకపోవడం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తే ఎన్టీఆర్ భార్యగా తనను ఆహ్వానించకపోవడం తప్పు అని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిం ఆహ్వానపత్రికను పరిశీలిస్తే ప్రైవేటు ఫంక్షన్‌కు రాష్ట్రపతి గెస్ట్‌గా వెళ్తున్నట్లు ఉందన్నారు. ఎన్టీఆర్ భార్యగా ఆ నాణెం అందుకోవడానికి తనకే అర్హత ఉందని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. అంతేగాని వాళ్లకు లేదు అని చెప్పుకొచ్చారు. ప్రాణాలు తీసిన వాళ్లు నాణెం విడుదల కార్యక్రమానికి వెళ్లారంటూ ఘాటుగా విమర్శలు చేశారు.ఎన్టీఆర్‌‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు వారసులుగా చెలామణి అయితే తాళి కట్టించుకున్న భార్యనైన తనను అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు.

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వదిలే ప్రసక్తేలేదు

ఎన్టీఆర్ కొడుకులు అమాయకులని కానీ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరిలు మాత్రం దుర్మార్గులు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో తన పోరాటం దగ్గుబాటి పురంధేశ్వరిపైనే ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి కుట్రలు చేస్తోందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పురంధేశ్వరి తిరిగిన ప్రతీ నియోజకవర్గంలో తాను తిరుగుతానని..ఒక్క సీటు కూడా రాకుండా ప్రచారం నిర్వహిస్తానని లక్ష్మీపార్వతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఎన్టీఆర్ తనతో చెప్పిన మాటలను ప్రజలకు వివరిస్తానని అన్నారు. తనను చులకన చేయాలని ప్రయత్నిస్తే ఎన్టీఆర్‌ను చేసినట్లేనని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌‌కు చంద్రబాబు బయట నుంచి వెన్నుపోటు పొడిస్తే.. అంతర్గతంగా పురంధేశ్వరి వెన్నుపోటు పొడిచారన్నారు. పురంధేశ్వరిని రాజకీయాల్లోకి వద్దు అన్నందుకు ఎన్టీఆర్‌పై కుట్రలు చేసిందన్నారు. తండ్రిపై కోపంతోనే పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.తనను ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారో లేదో ఆయన పిల్లలకు తెలియదా అని అన్నారు. ఎన్టీఆర్ భార్యనని మెడలో ఫొటో పెట్టుకుని తిరగాలా? ఎన్టీఆర్‌‌తో వివాహం అయినట్లు ఫొటోలు, వార్తా కథనాలు సైతం ఉన్నాయి. అంతేకాదు సాక్షాత్తూ ఎన్టీఆర్ అనేకసార్లు బహిరంగంగా ప్రకటించారు అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో మౌనం వహించానని ఇక వదిలే ప్రసక్తేలేదన్నారు. చంద్రబాబు, పురంధేశ్వరి, బాలకృష్ణనలను అందరినీ బయటికి లాగుతానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయాల్లో ఉండకుండా చేస్తానంటూ శపథాలు చేశారు. పురంధేశ్వరి తనకంటే ఎక్కువగా అవమానాలకు గురవుతారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌‌కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారని లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేయడమేంటని లక్ష్మీపార్వతి నిలదీశారు. నాణేం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఢిల్లీలో తేల్చుకుంటానని..రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుస్తానని నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed