చంద్రబాబు సేవలో పురంధేశ్వరి.. జనసేన తోకపార్టీ : మంత్రి ఆర్‌కే రోజా

by Seetharam |
చంద్రబాబు సేవలో పురంధేశ్వరి.. జనసేన తోకపార్టీ : మంత్రి ఆర్‌కే రోజా
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీకి కొమ్ముకాస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. పురంధేశ్వరికి పదవులు, డబ్బుపై ఆశ తప్ప నైతిక విలువలు లేని వ్యక్తి అని మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టులనే పురంధేశ్వరి చదివి వినిపిస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆమె పార్టీకి తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని మండిపడ్డారు. పురంధేశ్వరి ఎవరికోసం పనిచేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు ఈపాటికే అర్థమైందని అన్నారు. చంద్రబాబు నాయుడు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ బీజేపీని భ్రష్టుపట్టిస్తున్న పురంధేశ్వరిని పార్టీ అగ్రనాయకత్వం ఆమెను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో మంగళవారం మంత్రి ఆర్‌కే రోజా మీడియాతో మాట్లాడారు. పురంధేశ్వరికి నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు చేసిన స్కామ్‌లపై సమగ్ర విచారణ కోరుతూ సీబీఐకి లెటర్‌ రాయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ ముంచేశాడని ఆరోపించారు.ఐదేళ్ల పాలనను అవినీతిమయం చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన స్కాములన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అవినీతి బయటపడుతుండటంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారనే భయంతో తోకపార్టీని వెంటేసుకొని తిరుగుతున్నాడని మంత్రి ఆర్‌కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story