‘పార్లమెంట్ ఒక విశ్వవిద్యాలయం’.. టీడీపీ ఎంపీలకు ప్రధాని మోడీ కీలక సూచన

by Satheesh |
‘పార్లమెంట్ ఒక విశ్వవిద్యాలయం’.. టీడీపీ ఎంపీలకు ప్రధాని మోడీ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ ఎంపీలకు ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న 16 మంది టీడీపీ ఎంపీలతో బుధవారం ప్రధాని మోడీ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఒక విశ్వవిద్యాలయమని, పార్లమెంట్‌లో ఎంత ఎక్కువ సేపు సమయం గడిపితే అంత ఎక్కువ నేర్చుకుంటారని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు కష్టపడి పని చేసి ఏపీకి, దేశానికి మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలని సూచించారు.

మీకు ఇష్టమైన అంశాలపై పార్లమెంట్‌ చర్చల్లో పాల్గొనండని, చర్చల్లో పాల్గొనేటప్పుడు టాపిక్‌ను అధ్యయనం చేసి మాట్లాడితే సభలో అందరి మన్ననలు పొందుతారని చెప్పారు. మీకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఫోన్ చేస్తే అందుబాటులో లేకనపోయినా తన కార్యాలయ అధికారులు సమస్యను నోట్ చేసుకుంటారని తెలిపారు. తర్వాత సమయం చూసుకుని నేను మళ్లీ మీకు ఫోన్ చేస్తానని చెప్పారు. దాదాపు టీడీపీ ఎంపీలతో మోడీ అరగంట పాటు చిట్ చాట్ చేశారు. టీడీపీ ఎంపీలతో మోడీ ప్రత్యేకంగా భేటీ కావడం దేశ రాజధానిలో చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed