Cm Jaganకు చేరిన పీకే రిపోర్టు.. ఇక నాన్చుడు లేదు.. తేల్చుడే !

by srinivas |   ( Updated:2022-12-08 12:09:36.0  )
Cm Jaganకు చేరిన పీకే రిపోర్టు.. ఇక నాన్చుడు లేదు.. తేల్చుడే !
X
  • ఎన్నికల రేసులో ఉండేదెవరో?
  • బరి నుంచి నిష్క్రమించేదేవరో
  • నేడు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ కీలక నిర్ణయం
  • సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మళ్లీ చోటు కల్పించేవారిపై చర్చ

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టారు. 2019 ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించిన వైసీపీ..2024 ఎన్నికల్లో ఒక ప్రభంజనం సృష్టించాలని.. ఈ విజయం చరిత్ర తిరగరాసేలా ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందుకు కలిసి వచ్చే ప్రతీ అంశాన్ని చాలా చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నారు. 175కు 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తన అమ్ములపొదిలోని ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. తాను ఎంత ఫోకస్ పెట్టినా...కొందరు నేతలు తాను అనుకుంటున్న టార్గెట్ రీచ్ కావడం లేదని సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు 26 జిల్లాల పార్టీ అధ్యక్షులు, 8 మంది రీజినల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గాల పరిశీలకులతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యి దిశానిర్దేశం చేశారు.

అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదికలివేనా?

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి దోహదపడే అంశాలు.. గెలుపొందే అభ్యర్థులపై సీఎం వైఎస్ జగన్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలను ప్రజల్లోకి పంపారు. దీంతో వారి పర్యటనలకు వస్తున్న ప్రజాదరణ, ప్రజల్లో వారికున్న పరపతిపై ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీం అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికను సీఎం జగన్‌కు అందజేసినట్లు సమాచారం.. ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉన్నచోట అభ్యర్థులను మార్చేందుకు కార్యచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న తరుణంలో అలాంటి నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు చేస్తారని సమాచారం. 151 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో తిరిగి టికెట్లు దక్కేదెవరికి..అవకాశం కోల్పోతోందెవరనే దానిపై కూడా స్పష్టమైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేదెవరో... ఉద్వాసనకు గురయ్యేదెవరో అన్న దానిపై అటు నేతల్లోనూ ఇటు కార్యకర్తలు, రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

ప్రత్యామ్నాయంపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్

తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పలు ప్రాంతాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపు ఖాయమని చెప్పేసింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన సైతం ప్రకటించేశారు. అంతేకాదు ఇంకా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదే వ్యూహాన్ని సీఎం వైఎస్ జగన్ సైతం అప్లై చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదని తేల్చి చెప్పేశారు. ఎమ్మెల్యేలు..నేతలకంటే పార్టీయే సుప్రీం అని చెప్పుకొచ్చారు. ఎవరికైనా టికెట్ రాలేదంటే వారి సమర్ధత - పని తీరే కారణమంటూ పలు మీటింగ్‌లలో బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 36 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారని వారిని మార్చేస్తారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎక్కడైతే వైసీపీ బలహీనంగా ఉందో అక్కడ కొత్త అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కీలక నిర్ణయం ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది.

వలంటీర్ వ్యవస్థపైనా చర్చ

వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు...పార్టీని ప్రజలకు మరింత చేరువ చేర్చేందుకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పార్టీలోనూ వలంటీర్ వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రతీ 50 ఇళ్లకు ఒక వైసీపీ కార్యకర్తను నియమించాలని యోచన చేస్తున్నారు. ఈ అంశంపైనా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చిస్తారని తెలుస్తోంది. పార్టీ వలంటీర్ల నియామకానికి సంబంధించి నియామకాలు సైతం చేపట్టాలని ఆదేశించనున్నారు. అలాగే పార్టీని బూత్ లెవెల్‌ నుంచి బలోపేతం చేయాలని దీనికి సంబంధించిన కార్యచరణ సిద్ధం చేయాలని ఆదేశిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒక కీలక నేతలను బాధ్యులుగా చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో తిరుగుతూనే ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇదే తరుణంలో వలంటీర్ వ్యవస్థను తీసుకువస్తే ఎన్నికలకు వెళ్లడం మరింత ఈజీ అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఇవన్నీ కలిసి వస్తాయని సీఎం జగన్ భావిస్తున్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే అటు టీడీపీకి, ఇటు జనసేనతోపాటు విపక్షాలకు సమయం ఇవ్వకుండా ఇరుకున పెట్టొచ్చని ప్లాన్ వైసీపీలో ఉంది. ఈ నేపథ్యంలోనే వలంటీర్ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

వర్క్ డివిజన్‌పై చర్చించే అవకాశం

ఇదిలా ఉంటే ఇటీవలే నియోజకవర్గాల పరిశీలకులను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని ఎమ్మెల్యేలతో కో ఆర్డినేట్ చేసే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రజల్లోకి వెళ్లేందుకు అటు పరిశీలకులు.. ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు వర్క్ డివిజన్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. సహ ఇన్‌చార్జిలు, అబ్జర్వర్లతో కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో అది పార్టీకి కీడు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు అందర్నీ సమన్వయ పరిచేలా...పలు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు సరిగ్గా పని చేయకపోతే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పరిశీలకులతోపాటు ఎవరికి అప్పగించాలనే దానిపై కూడా పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.

నేతల్లో టెన్షన్ టెన్షన్

వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చర్చించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, రీజినల్ కో ఆర్డినేటర్లు, అబ్జర్వర్లు, పార్టీ అధ్యక్షులతో చర్చించి చేపట్టాల్సిన పనులు.. ప్రస్తుతం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కూలంకుశంగా సీఎం జగన్ చర్చించారు. అలాగే ప్రజల్లో ఎమ్మెల్యేలకు ఉన్న ఆదరణ,సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేయడంతోపాటు ప్రశాంత్ కిశోర్ సర్వే నివేదికలు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే అంశంపై ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ సంఘాలను ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జిలకు అనుసంధానం చేసి ఇకపై ముందుకు సాగాలని ఆదేశిస్తారని సమాచారం. ఒకవైపు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో సీఎం జగన్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటే అటు వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతల్లో మాత్రం టెన్షన్ నెలకొంది. ఇటీవలే 8 మందిని జిల్లా అధ్యక్షులను పదవులను తొలగించారు. అలాగే రీజినల్ కో ఆర్డినేటర్లను కూడా మార్చారు. దీంతో తమ పదవులు ఉంటాయా లేక ఊడుతాయా అన్న టెన్షన్ నేతల్లో నెలకొంది.

Advertisement

Next Story